Sukhbir Badal: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎంను విమానం నుంచి దించేశారని ఆరోపించారు. శనివారం మాన్‌తోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. దీని వల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యం అయింది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భగవంత్ మాన్ హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేశాయంటూ బాదల్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనపై వివరణలు కోరారు. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ నేతలను కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు
“పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” అని ట్వీట్ చేశారు బాదల్. అంతకుముందు ఆగస్టు 31న, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో సహా ఒక ప్రతినిధి బృందం పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు మెమోరాండం సమర్పించి, రాష్ట్ర ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.పాలసీలో కుంభకోణం జరిగిందని ప్రతినిధి బృందం ఆరోపించింది. ‘ఢిల్లీలో జరిగినట్లుగానే పంజాబ్ ఎక్సైజ్ పాలసీలోనూ స్కామ్ జరిగింది. ఢిల్లీ ఎల్‌జీ ఎక్సైజ్ పాలసీ కేసుపై విచారణకు ఆదేశించినట్లుగా, పంజాబ్‌లోనూ అదే తరహాలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం’’ అని బాదల్ అన్నారు.
Assault on lift giver: లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి.. ఆపై బైక్ తో..
పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా కూడా ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్‌ది తప్పని తేలితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ సర్కారును ఢిల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ పరోక్షంగా కేజ్రీవాల్, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భగవంత్ మాన్‌పై చర్యలు తీసుకుంటారా లేదా అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు . ఆదివారం భారత్‌కు తిరిగొచ్చారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది.