NTV Telugu Site icon

Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎంత వరకు సేఫ్ ? అనుమతిపై మరోమారు అధ్యయనం

Yadadri

Yadadri

Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది. ఈ అధ్యయనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. విద్యుత్తు కేంద్రం నిర్మించే స్థలం అమ్రాబాద్‌ అభయారణ్యానికి ఎంత దూరంలో ఉందన్న అంశాన్ని నిర్ధారించి చెప్పాలని తెలిపింది. పది కిలోమీటర్ల దూరంలోపు ఉంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 2న జరిగిన పర్యావరణ సమీక్ష కమిటీ సమావేశంలో ఈ విద్యుత్తు కేంద్రంపై చర్చించినట్లు తెలిపింది. రూ.29,965.48 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులో 61.50 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖకు జెన్‌కో తెలిపింది.

Read Also: Minister KTR: శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ గతంలో ఎన్జీటీ దక్షిణ జోన్‌ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 9 నెలల్లోగా బహిరంగ విచారణలు చేపట్టి, మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి పర్యావరణ అనుమతులు తీసుకునేదాకా విద్యుదుత్పాదన జరగడానికి వీల్లేదని, యంత్రాలు బిగించరాదని జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, డాక్టర్‌ కోర్లపాటి సత్యగోపాల్‌ నేతృత్వంలోని బెంచ్‌ తీర్పు ఇచ్చింది. సివిల్‌(నిర్మాణ) పనులు మాత్రమే చేసుకోవాలని స్పష్టం చేసింది. యాదాద్రి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కన్జర్వేషన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ట్రస్ట్‌, సమతా (విశాఖపట్నం) ఎన్జీటీలో కేసు దాఖలు చేసి.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలతో పాటు తెలంగాణ పర్యావరణ, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వి భాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ స్టేట్‌ పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌పై విచారించిన బెంచ్‌.. జూలై 22న తీర్పును రిజర్వ్‌ చేసి, సెప్టెంబరు 30న వెలువరించింది.

Read Also: Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ

రెడ్‌ కేటగిరీలో ఉన్న థర్మల్‌ కేంద్రాలకు అటవీ భూములను కేటాయించడం తగదని ఎన్జీటీ బెంచ్‌ సూచించింది. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో 14.03 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ఉందని చెప్పారని, కచ్చితంగా ఎంత దూరంలో ఉందో అటవీ ముఖ్య సంరక్షణ అధికారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాదాద్రికి తదుపరి పర్యావరణ అనుమతి తీసుకునేందుకు 9నెలల గడువు ఇచ్చింది. ఆలోగా అభయారణ్యాల రక్షణ చట్టం-1972ను అనుసరించి.. జాతీయ అభయారణ్యాల మండలి నుంచి తగిన అనుమతి తెచ్చుకోవాలంటూ నిర్దేశించింది. ప్లాంట్‌ నిర్మాణ సమయంలో రూ. 25099 కోట్ల అంచనాలతో పనులు చేపట్టగా.. అందులో పర్యావరణ పరిరక్షణకే రూ.5597 కోట్లను వెచ్చించనున్నట్లు జెన్‌కో గుర్తు చేసింది. తాజాగా అంచనా వ్యయం రూ.29965 కోట్లకు చేరింది. ఇప్పటిదాకా 55 శాతం పనులు మాత్రమే జరగ్గా.. రూ.16 వేల కోట్ల దాకా వెచ్చించారు.