students saved paddy: కోటి విద్యలు కూటి కోసమే అన్న నానుడి తెలిసిందే. మనం ఎన్ని పనులు చేసినా జానెడు పొట్ట నింపుకునేందుకే. అలాంటి కడుపుకు అన్నం పెడుతున్న రైతుకు ప్రతీ ఒక్కరూ సాయంగా ఉండాలని బాల్యం నుంచే తెలిసుండాలని నిరూపించారు కొందరు విద్యార్థులు. ఆరుగాలం కష్టపడిన రైతు పంటను వరుణుడి నుంచి కాపాడి శభాష్ అనిపించుకుంటున్నారు దోమలపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వానలు పడుతున్నాయి. నల్గొండ జిల్లా దోమలపల్లి గ్రామంలోని రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లో తమ వరిధాన్యం ఆరబెట్టారు. ఈ సమయంలో వర్షం పడింది. ధాన్యమంతా ఆరబెట్టడంతో తడిసిపోయే పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతుండగా.. అటుగా వెళ్తున్న విద్యార్థులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే ధాన్యం దగ్గరికి వెళ్లి రైతులు కష్టపడి పండించిన పంట వర్షంపాలు కాకుండా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్దిగా ఆలస్యం అయ్యుంటే పంట మొత్తం తడిసి పాడయ్యేది. కాగా, విద్యార్థులు చేసిన పని అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. రైతులు, ఇతరులు ఆ విద్యార్థులను అభినందించారు.