Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?

Australia Team Cwc 2023

Australia Team Cwc 2023

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉస్మాన్ ఖ్వాజా తన పుస్తకంలో చేసిన సంచలన వ్యాఖ్యల దుమారం చల్లకముందే, ఆ దేశ మాజీ లెగ్ స్పిన్నర్ స్టూవర్ట్ మెక్‌గిల్ తాను కూడా గతంలో బాల్ ట్యాంరింగ్‌కు పాల్పడినట్లు బహిరంగంగా అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు, 3 వన్డేలు ఆడిన మెక్‌గిల్.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మైదానంలో బాల్ ట్యాంపరింగ్ ఎలా చేసేవారనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

తాను మ్యాచ్‌ల సమయంలో టీ విరామం తర్వాత బంతిని మార్చేసేవాడినని మెక్‌గిల్ తెలిపారు. తన బొటనవేలుకు చిన్న  శాండ్ పేపర్ ముక్కను టేప్‌తో అంటించుకుని మైదానంలోకి దిగేవాడినని, అంపైర్లు బంతిని వదిలిపెట్టిన సమయంలో దానిని తీసుకుని బంతిని గరుకుగా మార్చేసేవాడినని వివరించారు. ఆ తర్వాత ఆ పర్‌ను తీసిపారేసేవాడినని, బంతిపై గీతలు పడటం మినహా ఎవరికీ ఎలాంటి అనుమానం వచ్చేది కాదని చెప్పారు. ఆ రోజుల్లో ప్రత్యర్థి జట్లు కూడా ఇవే పద్ధతులు పాటించేవని, అందుకే దీనిని తప్పుగా భావించలేదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా తన పుస్తకంలో 2018 నాటి కేప్‌టౌన్ టెస్ట్ పేపర్ ఉదంతంపై సంచలన నిజాలు వెల్లడించారు. 2018లో దక్షిణాఫ్రికా టూర్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ విషయం జట్టులోని ప్రతి సభ్యుడికి ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. ఖ్వాజా చేసిన ఈ వ్యాఖ్యలకు తోడుగా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా స్పందిస్తూ ‘ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది’ అని అనడం ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేపింది. 2018 నాటి ఆ ఘటనలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బ్యాటర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లపై బోర్డు కఠిన నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా మెక్‌గిల్ చేసిన ఈ తాజా ప్రకటనతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం మళ్లీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.