NTV Telugu Site icon

House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..

House Fire

House Fire

House Fire: ఓ ఇంట్లో అంతుచిక్కని మిస్టరీ చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు.. కానీ చంద్రగ్రహణం ఏర్పడిన రోజు నుంచి ఆ ఇంటిలో ప్రతీరోజూ మంటలు వ్యాప్తిచెందుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో జరిగింది. ఈ నెల 8 చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాత ఇంట్లో ప్రతి రోజూ రాత్రి మంటలు వ్యాప్తిచెందుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణమేమో అని విద్యుత్ కనెక్షన్ తీయించారు. ఆ తర్వాత కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో వారిలో భయం మరింత పెరిగింది. అంతేకాదు, విద్యుత్ కనెక్షన్ లేకుండా కూలర్‌ నుంచి మంటలు రావడం, బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో భయంతో వారంతా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఉందేమోనని విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి ఎర్తింగ్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందంటూ కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.

Read Also: Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్

కమల్ పాండే అనే వ్యక్తి స్థానిక మార్కెట్‌లోని ఎస్బీఐకు సమీపంలో నివసిస్తున్నాడు. తనకున్న రెండంతస్తుల బిల్డింగ్ లో తన తమ్ముడు సహా 9 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. నవంబరు 8న చంద్రగ్రహణం తర్వాత సాయంత్రం ఇంట్లోని విద్యుత్ బోర్డులో తొలుత మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పివేశారు. ఎలక్ట్రీషియన్‌ సాయంతో బోర్డు మార్పించారు. అయితే, ఆ తర్వాతి రోజు టాయిలెట్‌లోని ఎలక్ట్రిక్ బోర్డులో మళ్లీ మంటలు అంటుకోవడంతో విద్యుత్ కనెక్షన్ తీయించారు. విచిత్రంగా తర్వాత కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుటుంబం వేరే ఇంట్లో అద్దెకు తీసుకుని వెళ్లారు. ఇద్దరు సోదరులు కాపలాగా ఇంటి వెలుపల నిద్రించేవారు. తర్వాత కూడా మంటలు చెలరేగడంతో అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషయం తెలిసిన స్థానికులు ఆ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు. కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భూకంపం కారణంగా భూమి లోపల ఉండే వాయువుల లీకేజీ కారణంగా ఇలా జరుగుతుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Show comments