Site icon NTV Telugu

Stock Market: కొత్త ఊపు తెచ్చిన ఎగ్జిట్ పోల్స్.. ఆల్ టైమ్ లాభాల్లో సూచీలు

Stock

Stock

స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఊపు వచ్చింది. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్లకు ఊపిరి పోశాయి. ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారన్న పోల్స్ పల్స్‌ను బట్టి సూచీలు కొత్త జోష్ నింపాయి. ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. సెన్సెక్స్ 2,507 పాయింట్లు లాభపడి 76, 468 దగ్గర ముగియగా… నిఫ్టీ 733 పాయింట్ల లాభపడి 23, 263 దగ్గర ముగిసింది. ఎగ్జిట్ పోల్స్‌కే సూచీలు ఈ రేంజ్‌లో ఉంటే.. మంగళవారం ఏకంగా ఒరిజనల్ రిజల్ట్ రాబోతుంది. దీనిని బట్టి ఊహించనిదానికంటే ఎక్కువగా సూచీలు దూసుకుపోవచ్చని తెలుస్తోంది. ఇక సోమవారం అన్ని రంగాలు భారీ లాభాల్లో ముగియడం విశేషం.

మొత్తం 13 రంగాల సూచీలు గ్రీన్‌లో ఉండగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు పవర్ సెక్టార్‌లు నిఫ్టీలో ర్యాలీకి దారితీశాయి. సోమవారం నిఫ్టీ 23,338 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకగా.. సెన్సెక్స్ 76,738 దగ్గర తాజా గరిష్టాన్ని తాకింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బ్యాంక్ నిఫ్టీ 51,000ను తాకింది.

మధ్యాహ్నం 1:55 గంటలకు సెన్సెక్స్ 2,325 పాయింట్లు లాభపడి 76,286 దగ్గర, నిఫ్టీ 50 696 పాయింట్లు పెరిగి 23,227 దగ్గర ఉన్నాయి. దాదాపు 2,218 షేర్లు పురోగమించగా, 1,293 షేర్లు క్షీణించాయి. ఇక 105 షేర్లులో ఎలాంటి మార్పులేదు.

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 8 లక్షల కోట్ల రూపాయలను అధిగమించిన ఏడవ భారతీయ లిస్టెడ్ కంపెనీగా SBI నిలిచింది. భారతీయ ఈక్విటీలలో బుల్లిష్ ట్రెండ్‌కు అద్దం పడుతూ వరుసగా రెండో సెషన్‌లోనూ అదానీ గ్రూప్ జోరందుకున్నాయి.

Exit mobile version