కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండుసార్లు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వచ్చినా భక్తుల రద్దీ ఏమాత్రం కూడా తగ్గడం లేదు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీకి తగ్గట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోభాగంగా ఇవాళ(శనివారం) ఏడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో తిరుమల మూడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా కొనసాగింది. దీంతో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
Read Also: Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి వాహనంగా ఉండడం విశేషంగా చెప్పవచ్చు.. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల హృదయాల నుంచి అనందరసం స్రవిస్తుంది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి టీటీడీ అధికారులతో పాటు తిరుమల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.