Sri Venkateswara Swamy Temple in Kasibugga, Srikakulam: ఏపీలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో పిల్లలతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయ లేదని అందుకే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై మంత్రులు ఆరా తీస్తున్నారు. అయితే.. తొక్కిసలాట జరిగిన ఆలయానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి..? ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకుంద పండా పదమూడేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం ఆర్తితో క్యూ లైన్ లో నిలబడి ఎదురు చూశారు. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారు. అయితే ఆ భాగ్యం దక్కనే లేదు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. తాను ఎనిమిది పదుల వృద్ధుడినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తల్లితో తన అనుభవాన్ని పంచుకున్న ఆయనకు ఆలయం నిర్మించాలని ఆలోచన వచ్చింది. హరిముకుంద పండా పట్టణం నడిబొడ్డున వీరి కుటుంబానికి సుమారు వందెకరాల భూమి ఉంది. జంట పట్టణాల్లో 100 ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ 12 ఎకరాల 40సెంట్ల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం నిర్మించారు. ఇలా శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. పండగ పూట పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
READ MORE: Ayyappa Swamy Temple: ఏపీలో మరో “శబరిమల”.. గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప..
