Sri Lanka: శ్రీలంకలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాల దెబ్బతో వరుసగా కొండచరియలు విరిగి పడటం, భారీ వరదలు ఏర్పడటం వల్ల అనేక ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ముఖ్యంగా కాండీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు పర్యాటకులతో కిలకిలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినట్టుగా మారిపోయింది. మొత్తం పట్టణం నీట మునిగి, రోడ్లు, ఇళ్లు, పంటభూములు అన్నీ వరద ప్రవాహంలో కలిసిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 510 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. మరో 386 మందికి పైగా ఆచూకీ గల్లంతయ్యింది. శిథిలాలలో ఇంకా చాలా మంది ఉండే అవకాశముండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. యాబైవేలకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనేక వందల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమై నివాసయోగ్యం లేకుండా మారాయి.
READ MORE: Bharat Taxi: ఓలా, ఊబర్ లకు ధీటుగా రాబోతున్న భారత్ టాక్సీ..
ఈ తుఫాన్ ప్రభావం దాదాపు 12 లక్షల మందిపై పడింది. వేలాదిమంది నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆహారం, నీరు, ఔషధాలు వంటి అవసరాల కొరత తీవ్రమవడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. కాండీతో పాటు అంపారా, బదుల్లా జిల్లాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. రవాణా మార్గాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధ’ ద్వారా పెద్దమొత్తంలో సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వందలాదిమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య పరికరాలను పంపించింది. నౌకాదళం, వైమానిక దళం కలిసి చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం భారత్ సహాయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.
