ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సొంత గడ్డపై 300 చేస్తుందని అంచనాలున్న హైదరాబాద్‌ను అద్భుత బౌలింగ్‌తో 200 కూడా కోటనీయలేదు. 20 ఓవర్లలో 190 పరుగులకు పరిమితం చేయడమే కాకుండా.. లక్షాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ముందుగా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ (4/34) చెలరేగగా.. ఆపై బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (70; 26 బంతుల్లో 6×4, 6×6), మిచెల్ మార్ష్ (52; 31 బంతుల్లో 7×4, 2×6) మెరుపులు మెరిపించారు. అయితే జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన వెస్టిండీస్ స్టార్ పూరన్.. సహచర ఆటగాడు రవి బిష్ణోయ్‌కు క్షమాపణలు చెప్పాడు.
టాస్ గెలవగానే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యంకు గురిచేసింది. అయితే కెప్టెన్ నిర్ణయం సరైందే అనేలా శార్దూల్ ఠాకూర్ సన్‌రైజర్స్‌కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో డేంజరస్ బ్యాటర్లు అభిషేక్‌శర్మ (6), ఇషాన్ కిషన్ (0)లను ఔట్ చేశాడు. ఈ సమయంలో స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (47; 28 బంతుల్లో 5×4, 3×6), నితీశ్ రెడ్డి (32; 28 బంతుల్లో 2×4) క్రీజులో నిలిచారు. హెడ్ దూకుడుగా ఆడడంతో సన్‌రైజర్స్ స్కోర్ పరుగులు పెడుతోంది. ఈ సమయంలో రవి బిష్ణోయ్ బౌలింగ్‌కు రాగా.. 6వ ఓవర్ మొదటి బంతికి హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను నికోలస్ పూరన్ నేలపాలు చేశాడు. అదే ఓవర్లోని ఐదవ బంతికి బిష్ణోయ్ కూడా క్యాచ్ పట్టలేకపోయాడు. దాంతో హెడ్ రెండు సార్లు (35, 42 పరుగుల వద్ద) ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. చివరికి ప్రిన్స్ యాదవ్ 8వ ఓవర్ 3వ బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాచ్ అనంతరం తన క్యాచ్ డ్రాప్‌పై నికోలస్ పూరన్ స్పందించాడు. కీలక బ్యాటర్ క్యాచ్ మిస్ చేసినందుకు సహచర ఆటగాడు రవి బిష్ణోయ్‌కు క్షమాపణలు తెలిపాడు. ‘రవి బిష్ణోయ్ నీకు క్షమాపణలు చెబుతున్నా. ట్రావిస్ హెడ్ క్యాచ్ మిస్ చేశాను. నువ్వు బాధపడి ఉంటే సారీ. ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్తపడతా’ అని పూరన్ చెప్పుకొచ్చాడు. పూరన్ క్షమాపణలు చెప్పడంపై నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. పూరన్ సూపర్, పూరన్ క్రీడాస్ఫూర్తి గలవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ పూరన్ వద్దనే ఉంది. రెండు మ్యాచ్‌లలో 145 రన్స్ చేశాడు.