NTV Telugu Site icon

Cooking Oil Price Hike: సలసలా కాగుతున్న వంట నూనె ధరలు..

Cooking Oil

Cooking Oil

Cooking Oil Price Hike: వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. కొన్ని నెలలుగా నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ.. గత నెల నుంచి వంట నూనె ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో వంట నూనె ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు వినియోగించే వంట నూనెలో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో మూడేళ్ల క్రితం రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. సన్‌ఫ్లవర్‌తో పాటు పామాయిల్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర 200 రూపాయిలకు చేరింది. అయితే కేంద్ర తీసుకున్న నిర్ణయాలతో రేట్లు దిగొచ్చాయి. లీటర్ నూనె 120 నుంచి 130 రూపాయిల మధ్యే పలికింది. మూడు నాలుగు నెలల వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగాయి. కాస్త ఊరట కలిగిందిలే అనుకునేలోపు మరో సారి వంట నూనెల ధరలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి.

నెల రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. గతంలో సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్ 130 రూపాయిలు ఉండేది. ఇప్పుడు 150 రూపాయిలకు చేరింది. పామాయిల్‌ గతంలో కిలో వంద రూపాయిలు ఉండగా.. దీనిపై కూడా ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయిల ధర పెరిగింది. ఇండోనేషియా, అర్జెంటీనా దేశాలు భారతదేశానికి నూనెను ఎగుమతి చేసే దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మలేషియా నుంచి అధికంగా పామాయిల్ నూనె మన దేశానికి దిగుమతి అవుతుంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్ ప్లవర్ ఆయిల్, ఉక్రెయిన్ నుంచి సన్ ప్లవర్ నూనెను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. గత సంవత్సరం అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసుకుంది. దీని కోసం లక్షా 8 వేల 424 కోట్లను ఖర్చు చేసింది.

గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్‌ ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచింది. రిఫైన్డ్ నూనెలపై సుంకాన్ని 13.7శాతం నుంచి 35.7శాతానికి పెంచింది. దీంతో నూనెల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గుదల కూడా వంట నూనె ధరలు పెరుగుదలకు కారణం అవుతుంది. దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో చెల్లిస్తుండడంతో ఆ ప్రభావం రిటైల్‌ నూనెల మార్కెట్‌పై పడుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో 20రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్ లో 135 రూపాయిలు ఉన్న వంటనూనె ధర ప్రస్తుతం 150 రూపాయిలు దాటింది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌ నూనెల ధరలు ఆయా కంపెనీలను బట్టి 150 రూపాయిల నుంచి 170 రూపాయిల వరకు ఉన్నాయి.

వంట నూనెల ధరలు పెరగడంతో.. హోటల్స్, రెస్టారెంట్లపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. హోటల్స్ యాజమాన్యం ఫుడ్‌పై ధరలు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. రెస్టారెంట్లు సహా, హోటల్స్‌, స్వీట్‌ షాప్స్‌ మెనూలో ధరలు పెరగక మానవు. దీంతో సామాన్యుడికి ఇటు వంటగది బడ్జెట్‌తో పాటు.. బయటెక్కడన్నా తిన్నా, కొన్నా.. జేబుపై భారం పడుతుంది. కేంద ప్రభుత్వం మళ్లీ వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గిస్తేనే సామాన్యుడికి కొంత ఉపశమనం దక్కుతుంది. లేదంటే వంట నూనె మంట తగులుతుంది.