కార్పొరేట్ ఉద్యోగానికి తోడుగా అదనపు ఆదాయం సంపాదించాలనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆశ మొదటి రోజే ఆవిరైపోయింది. ఆటో కొనుగోలు చేసి సైడ్ బిజినెస్ చేద్దామని భావించిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ ఏకంగా ఆటోతో సహా పరారవ్వడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గౌరవ్ తోమర్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ ఘటనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తనతో పనిచేసే ఒక కొలీగ్‌కు ఉద్యోగంతో పాటు అదనపు సంపాదన కోసం ఆటో కొనుగోలు చేయాలనే సలహా వారి ఆఫీస్ ప్యూన్ ఇచ్చాడు. ఆటో కొని రోజువారీ అద్దెకు ఇస్తే రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు ఆదాయం వస్తుందని, పైగా ఆఫీస్ రాకపోకలకు కూడా ఉపయోగపడుతుందని ప్యూన్ నమ్మబలికాడు.
ప్యూన్ మాటలు నమ్మిన సదరు ఇంజనీర్ సుమారు రూ.1.75 లక్షలు వెచ్చించి కొత్త ఆటోను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆటో నడపడానికి బీహార్‌కు చెందిన ఒక డ్రైవర్‌ను ప్యూన్ సిఫారసు చేయగా.. రోజుకు రూ.600 అద్దెకు ఒప్పందం కుదుర్చుకుని అతనికి వాహనాన్ని అప్పగించారు. అయితే.. నూతనోత్సాహంతో ప్రారంభించిన ఈ సైడ్ బిజినెస్ మొదటి రోజే బెడిసికొట్టింది. వాహనం తీసుకున్న ఆ డ్రైవర్ ఒక్క రోజు కూడా అద్దె చెల్లించకుండా అదే రోజు ఆటోతో పరారయ్యాడు.
How can an engineer be so dumb after 12 years in a corporate job?
What happened, my colleague got an idea to earn some extra money. And that idea was given to him by the office peon: buy an E-Rickshaw, give it to someone, and take Rs. 500 to 700 rent per day. You will also save on your own commute.
So he told the office peon, fine, find someone. The peon suggested a man who come from Bihar. Then he bought an e-rickshaw for 175000/- and gave it to him at Rs. 600 per day. The man took it and ran away the same day.
He has been looking for him for 15 days now, and still has not found him.
— Gaurav Tomar (@talkwithgt) October 1, 2026
డ్రైవర్ మోసంతో షాక్ తిన్న బాధితుడు గత 15 రోజులుగా అతని కోసం గాలిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. పన్నెండేళ్లుగా కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న ఒక ఇంజనీర్ ఇంత అమాయకంగా ఎలా మోసపోయాడని గౌరవ్ తోమర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు, భద్రతా చర్యలు తీసుకోకుండా కేవలం ఎవరో చెబితే నమ్మి వాహనాన్ని అప్పగించడం వల్ల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా చేసే వ్యాపారాలు ఇలాంటి అనూహ్య పరిణామాలకు దారితీస్తాయని ఈ ఉదంతం నిరూపించింది.

