భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్ సిరీస్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరిగే మూడో వన్డే, అక్టోబర్ 29న కాన్‌బెరాలో జరిగే తొలి టీ20కి టికెట్లు మొత్తం బుక్ అయ్యాయి. రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లకు సంబంధించిన 90 వేల టికెట్లను అమ్మినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. భారత సంతతి అభిమానులు ఎక్కువగా టికెట్లు కొన్నారు. అమ్ముడైన టికెట్లలో భారత అభిమాన సంఘాలే 16 శాతం కొన్నాయని సీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అభిమానుల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల కోసం భారత్ ఆర్మీ 2400 టికెట్లను కొనుగోలు చేయగా.. మరో అభిమానుల బృందం ఫ్యాన్స్ ఇండియా 1400 టికెట్లను బుక్ చేసుకుంది. బ్రిసి బనియాస్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు అమిత్ గోయల్ గబ్బాలో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ఒక్కడే 880 టిక్కెట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఒకే మ్యాచ్‌కు అత్యధిక టిక్కెట్లు కొనుగోలు చేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ టిక్కెట్ల అమ్మకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చుసేందుకే ఎక్కువ మంది టికెట్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
