NTV Telugu Site icon

Vani jayaram: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత

11

11

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30 జన్మించారు. 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలు పాడి అభిమానుల్ని అలరించారు. ఆమె మృతిపట్ల ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ సంతాపం తెలుపుతున్నారు. ఆమె సేవలకు గానూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జయరాంను పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది.

వాణీ జయరాం అసలు పేరు కలైవాణి.. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన జయరాం.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. మూడు సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్న వాణీ జయరాం.. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం.

కె.బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో ఆమె పాడిన పాటలకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు రెండోసారి, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘తెలిమంచు కరిగింది’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘ఒక బృందావనం’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గళం నుంచి జాలువారిన ప్రతి పాటా సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా.. కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సహమే కారణమంటారు వాణీ తమకు పిల్లలు లేకున్నా.. ఆ లోటును సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుంటారామె. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు.