NTV Telugu Site icon

Singapore Airlines: లాభాల బాటలో సింగపూర్ ఎయిర్ లైన్స్.. ఉద్యోగులకు 8నెలల జీతం బోనస్

New Project (23)

New Project (23)

ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసిన క్రమంలో తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అందించాలని నిర్ణయించింది. 8 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కోవిడ్ విజృంభణతో దాదాపు అన్ని ఎయిర్‌లైన్ సంస్థలు నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడమే తిరిగి సంస్థ లాభాల బాట పట్టేందుకు కారణమని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

READ MORE: SRH vs PBKS: పంజాబ్ పై సన్రైజర్స్ విజయం.. రెండో స్థానానికి హైదరాబాద్

2023- 24 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థ రికార్డ్ స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చి నెల ముగిసే నాటికి కంపెనీ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2. 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తమ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు కల్పించడం సహా తమ ఉద్యోగుల మెరుగైన పనితీరే ఈ వృద్ధికి కారణమని సింగపూర్ ఎయిర్ లైన్స్ తెలిపింది. అందుకే లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్ గా అందించనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఏకంగా 36. 4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు వెల్లడించింది. ఇలా కంపెనీ ఆర్జించిన లాభాలను బోనస్ రూపంలో ఉద్యోగులకు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో దుబాయ్ ఎమిరేట్స్ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని బోనస్ గా అందించింది. ఇలా ఉద్యోగులను సైతం ఉత్సాహంగా పనిచేసేట్లు చేస్తోంది.

కాగా.. ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలో ఖర్చుల నియంత్రణ పేరుతో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కష్టకాలంలో ఉన్న ఉద్యోగం ఊడకుండ ఉండాలనే ఉద్యోగులు ఆశిస్తున్నారు. అలాంటిది బోనస్, ఇంక్రిమెంట్లు వంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. ఐటీ, టెక్ కంపెనీల తర్వాత విమానయాన రంగంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయి. కరోనాతో విమానయాన రంగం భారీగా దెబ్బతిన్నదని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో తమ ఉద్యోగులకు ఏకంగా 8 నెలల జీతాన్ని బోనస్‌గా అందిస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ తెలపడం ఆసక్తిగా మారింది.