243 కి.మీ రేంజ్‌, 90 కి.మీ టాప్‌ స్పీడ్‌.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్..!

  • సింపుల్‌ ఎనర్జీ భారత మార్కెట్లో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల..
  • ప్రారంభ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)..
  • మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో..
Simple Wave

Simple Wave

Simple Wave EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో సింపుల్‌ ఎనర్జీ (Simple Energy) కొత్త వేవ్‌ (Wave) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. దేశంలో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింపుల్‌ ఎనర్జీ తీసుకొచ్చిన తొలి ఫ్యామిలీ-ఫోకస్డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే. సెప్టెంబర్‌ చివరి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఆరు వేరియంట్లు..

సింపుల్‌ వేవ్‌ మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటిని సింపుల్‌ వేవ్‌ ఎస్‌, సింపుల్‌ వేవ్‌, సింపుల్‌ వేవ్‌+ వేరియంట్లుగా అందిస్తున్నారు. టాప్‌ వేరియంట్‌ అయిన వేవ్‌+లో 5Kw బ్యాటరీ ప్యాక్‌, 6.4Kw పీఎంఎస్‌ఎం మోటార్‌ ఉన్నాయి. ఇది 90 కి.మీ టాప్‌ స్పీడ్‌, గరిష్ఠంగా 243 కి.మీ ఐడీసీ రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీల్‌ టార్క్‌ 179Nmగా ఉంటుంది. మిగిలిన వేరియంట్లలో 3.7Kwh, 2.7 Kwh, 2.2 Kwh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి. వీటి ఐడీసీ రేంజ్‌ వరుసగా 171 కి.మీ, 132 కి.మీ, 110 కి.మీగా ఉంది. వేరియంట్‌ను బట్టి బ్యాటరీ, ఫీచర్లలో మార్పులు ఉంటాయి. అన్ని వేరియంట్లలో రైడ్‌, ఎకో, ఈకోఎక్స్‌ రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. అధిక వేరియంట్లలో అదనంగా స్పోర్ట్‌ మోడ్‌ కూడా లభిస్తుంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌..

సింపుల్‌ వేవ్‌లో చైన్‌-డ్రైవ్‌ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగించారు. బ్యాటరీ, మోటార్‌కు IP67 రేటింగ్‌ ఉంది. పోర్టబుల్‌ ఛార్జర్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. టాప్‌ వేరియంట్‌ అయిన వేవ్‌+లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. దీని ద్వారా బ్యాటరీని 0 నుంచి 80% వరకు 2 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

డిజైన్‌..

రోజువారీ కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింపుల్‌ వేవ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మొత్తం 70 లీటర్ల వరకు స్టోరేజ్‌ స్పేస్‌ ఉంది. సీటు కింద 63 లీటర్ల స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌, 3 లీటర్ల గ్లోవ్‌బాక్స్‌, అదనంగా 4 లీటర్ల పిల్‌ అనే స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. స్కూటర్‌ డిజైన్‌లో స్మూత్‌ ఎడ్జ్‌లు, కర్వ్‌లను అందించారు. ఫ్రంట్‌ ఏప్రాన్‌లో హెడ్‌ల్యాంప్‌ను ఏర్పాటు చేయగా, డీఆర్‌ఎల్‌లు కూడా హెడ్‌ల్యాంప్‌ యూనిట్‌లోనే ఉన్నాయి. సైడ్‌ ప్యానెల్స్‌పై కాంటూర్స్‌, వేవ్‌ బ్యాడ్జింగ్‌ కనిపిస్తాయి. సింగిల్‌-పీస్‌ సీట్‌ను అందించారు. వేరియంట్‌ను బట్టి పెర్ల్‌ వైట్‌, కోరల్‌ రెడ్‌, ట్విలైట్‌ బ్లాక్‌, పోలార్‌ బ్లూ, డాల్ఫిన్‌ గ్రే, ఫారెస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో స్కూటర్‌ లభిస్తుంది.

సింపుల్‌ వేవ్‌ వీల్‌బేస్‌ 1,347 మి.మీ. కాగా.. దీని పేలోడ్‌ కెపాసిటీ 150 కిలోలు కాగా, సీట్‌ ఎత్తు 775 మి.మీ. గా అందించారు. 175 మి.మీ. గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో పాటు 300 మి.మీ. వరకు వాటర్‌-వేడింగ్‌ సామర్థ్యం ఉందని కంపెనీ పేర్కొంది. ట్యూబ్యులర్‌ స్టీల్‌ ఫ్రేమ్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, ప్రోగ్రెసివ్‌ ట్విన్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్లు, 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. బ్రేకింగ్‌ కోసం ముందు డిస్క్‌, వెనుక డ్రమ్‌ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను అందించారు.

టీఎఫ్‌టీ డిస్‌ప్లే..

వేరియంట్‌ను బట్టి సింపుల్‌ వేవ్‌లో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే లేదా 5 అంగుళాల ఈబీఎన్‌ స్క్రీన్‌ ఉంటుంది. టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్న మోడళ్లలో బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌, కాల్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌, ఓవర్‌-ది-ఎయిర్‌ అప్‌డేట్స్‌ వంటి ఫీచర్లు లభిస్తాయి. అధిక వేరియంట్లలో ట్రాక్షన్‌ కంట్రోల్‌, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, హిల్‌-హోల్డ్‌ అసిస్ట్‌, రివర్స్‌ మోడ్‌, క్రాల్‌ మోడ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అన్ని వేరియంట్లలో ఫుల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ స్టాండర్డ్‌గా అందించారు.