CNG Car Mileage: ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వినియోగదారులు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. సీఎన్జీ కార్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించడమే కాకుండా, పర్యావరణానికి కూడా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే, కొన్నిసార్లు సీఎన్జీ కారు కొనుగోలు చేసిన తర్వాత ఆశించిన మైలేజ్ లభించక నిరాశ చెందాల్సి ఉంటుంది. దీనికి డ్రైవింగ్ అలవాట్లు, వాహనం నిర్వహణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ సీఎన్జీ కారుకు ఉత్తమ మైలేజ్ పొందవచ్చు.
కారులోని ఎయిర్ ఫిల్టర్ మురికి పడితే కార్ల మైలేజ్, పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని ఫలితంగా ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి, ఎక్కువ ఇంధనం ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల నెలకు కనీసం ఒకసారైనా ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయడం అవసరం. మీరు ఎక్కువగా దుమ్ము ఉన్న ప్రదేశాల్లో ప్రయాణిస్తే, మరిన్నిసార్లు ఎక్కువగా శుభ్రం చేయాలి. శుభ్రంగా ఉన్న ఎయిర్ ఫిల్టర్ మీ ఇంజన్ ఆరోగ్యంగా ఉంచి, మైలేజ్ పెంచడంలో సహాయపడుతుంది.
అలాగే, మీ కారు టైర్లలో కంపెనీ సూచించిన స్థాయిలో గాలి ఉండేలా ఎప్పుడూ శ్రద్ధ వహించండి. తక్కువ గాలిని లేదా ఎక్కువ గాలిని నింపడం లేకుండా చూసుకోండి. టైరులో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై ఘర్షణ పెరుగుతుంది. ఇది కారు ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచుతుంది, దాంతో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా టైర్ గాలి పీడనాన్ని చెక్ చేయడం చాలా అవసరం. ఇది కేవలం మైలేజ్ పెంచడమే కాదు, డ్రైవింగ్‌ను కూడా సురక్షితంగా మారుస్తుంది.
సీఎన్జీ కార్ల ఇంజిన్ మద్దతుకు మంచి నాణ్యత గల స్పార్క్ ప్లగ్ అవసరం. పెట్రోల్ కార్లతో పోలిస్తే, సీఎన్జీ వాహనాల్లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన స్పార్క్ ప్లగ్ వాడితే ఇంజన్ మంచి స్థితిలో ఉంటుంది. దానితో మైలేజ్ కూడా మెరుగవుతుంది. డ్రైవింగ్ సమయంలో క్లచ్‌ను తప్పుగా ఉపయోగించడం మైలేజ్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మైలేజ్ మెరుగ్గా కావాలంటే క్లచ్‌ను సరైన సమయంలో, సరైన విధంగా ఉపయోగించాలి. అనవసరంగా క్లచ్ ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. అంతేకాకుండా, విపరీతంగా క్లచ్‌ను వాడటం వల్ల క్లచ్ త్వరగా దెబ్బతింటుంది, ఇంజన్ పనితీరు తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవడంతో, కారు తక్కువ మైలేజ్ ఇస్తుంది. కాబట్టి క్లచ్‌ను జాగ్రత్తగా వాడటం ద్వారా మైలేజ్‌ను సులభంగా పెంచుకోవచ్చు.
సీఎన్జీ కార్ల మైలేజ్ పెంచాలంటే ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ స్థాయి నాణ్యతను సమయానికి పరిశీలించుకోవడం ఎంతో ముఖ్యం. స్థానిక మెకానిక్స్ వద్ద కాకుండా, నిపుణుల సహాయంతో ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ చెక్ చేయించుకోవాలి. సరైన స్థాయిలో మంచి నాణ్యత గల ఫ్లూయిడ్ వాడితే గేర్‌బాక్స్ సాఫీగా పనిచేస్తుంది. ఇంజన్‌పై అవసరములేని ఒత్తిడి తగ్గి, మైలేజ్ పెరుగుతుంది. ఈ సులభమైన మార్గాలతో సీఎన్జీ కార్ల మైలేజ్ సులభంగా పెంచుకోవచ్చు.
