సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 40 దాటినట్లు సమాచారం. కార్మికులు చనిపోవడంతో సిగాచి పరిశ్రమ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదైంది. అయితే సిగాచి పరిశ్రమ, అధికారుల లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి.
Also Read: Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు!
ప్రమాద సమయంలో పరిశ్రమలో డ్యూటికి 162 మంది వచ్చినట్టు సిగాచి యాజమాన్యం ప్రకటించింది. 143 మందే డ్యూటికి వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు లెక్కల్లో తేల్చారు. 57 మంది ప్రమాదం నుంచి బయటపడి ఇంటి వద్ద ఉన్నారని అధికారులు ప్రకటన చేశారు. ఆస్పత్రుల్లో 34 మంది చికిత్స తీసుకుంటున్నట్టు లెక్కలు చూపారు. 16 మంది ఆచూకీ దొరకడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. పటాన్ చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి 39 మృతదేహాలు వచ్చినట్టు సమాచారం. కంపెనీ లెక్కలు, అధికారుల లెక్కలకు 19 మంది తేడా ఉంది. ఏది నిజమో తెలియక బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొంది.
