Shubman Gill Records in IPL: ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్.. ఆఖరి రెండు బంతుల్లో జడేజా చేసిన మాయతో స్టేడియమంతా హోరెత్తింది. తన గురువులాంటి ధోనికి.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ ను కింగ్ లా ఏలిన మహేంద్ర సింగ్ ధోనికి.. 16వ సీజన్ ట్రోఫీ గెలుపును బహుమానంగా అందించాడు. ఆదివారమే జరగాల్సిన మ్యాచ్.. వరుణుడి బ్యాటింగ్ తట్టుకోలేక మండేకు షిఫ్ట్ అయ్యింది.. కానీ, ఆదివారమే జరిగి వుంటే, ఇంత మజా వచ్చేది కాదేమో.. మండే రోజు మస్తు మజా ఇచ్చింది ఫైనల్.
అయితే, ఈ ఏడాది ఐపీఎల్ విజేత చెన్నైనే అయినా స్టార్ మాత్రం గుజరాత్ ఓపెనర్ శుభమన్‌గిలే… 17మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మరే ప్లేయర్ కూడా గిల్ దరిదాపుల్లో లేరు. ఫైనల్లో ఇంకాస్త రాణించి ఉంటే ఓ ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టేవాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా కూడా నిలిచాడు గిల్. ఈ ఏడాది ఐపీఎల్‌లో గిల్ సగటు ఏకంగా 59.33 పరుగులంటే ఏ స్థాయిలో ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్.. అతడితో పాటు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి కెరీర్‌లో బెస్ట్ సీజన్‌గా మిగిలిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ అది కుదరలేదు.
కానీ, ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోనున్న శుభమన్.. పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, తొలి టీమ్ఇండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2021-973 పరుగులు) ఉన్నాడు. ఇప్పుడు అతడి తర్వాతి స్థానంలో గిల్ నిలిచాడు. 2022 సీజన్‌లో 863 పరుగులు చేసిన జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ 848 పరుగులు, కేన్ విలియమ్సన్ 735 పరుగులును అధిగమించాడు. ఇంకా ఈ సీజన్‌లో అతడకిది 13వ 30 ప్లస్ స్కోరు. ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 30ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
