Shreyas Iyer: 63 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ఎంతో చేదు అనుభవంతో ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ నుంచి భారత టీ20 పగ్గాలను అందుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. బెల్‌ఫాస్ట్ (Belfast) వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో విజయపథంలోకి దూసుకెళ్లిన టీమిండియా బాధ్యతలను అందుకోవడం శ్రేయస్ అయ్యర్‌కు ఓ పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే. టీ20 జట్టుకు సుదీర్ఘ కాలం (దాదాపు 63 మ్యాచ్‌లు) దూరంగా ఉండి, ఒకేసారి కెప్టెన్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన అయ్యర్ ఎన్నో ఆశలతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, మైదానంలో లీడర్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్(3) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ ఓటమితో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన 4వ భారత కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు.

విరాట్ కోహ్లీ (vs ఇంగ్లాండ్, 2017)
రిషభ్ పంత్ (vs సౌతాఫ్రికా, 2022)
శుభ్‌మన్ గిల్ (vs జింబాబ్వే, 2024)
శ్రేయస్ అయ్యర్ (vs ఐర్లాండ్, 2026)

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మోకాలి గాయం కారణంగా ఐపీఎల్, ప్రపంచకప్‌లకు దూరమై.. ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన పేసర్ హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్‌పై ఉన్న అదనపు బౌన్స్, సీమ్‌ను చక్కగా వాడుకుంటూ ఓపెనర్ రాస్ అడైర్, ప్రమాదకరమైన టిమ్ టెక్టర్‌లను పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా పవర్‌ప్లేలోనే హ్యారీ టెక్టర్‌ను అవుట్ చేయడంతో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, ఆ దశలో కెప్టెన్ లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీలు జట్టును అద్భుతంగా ఆదుకున్నారు. ఆరంభంలో తడబడినా టక్కర్ కేవలం 35 బంతుల్లోనే అర్ధశతకం (50) సాధించగా, డెలానీ ధాటిగా ఆడుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో డెలానీ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఐర్లాండ్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. డెలానీ 32 బంతుల్లో 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. ప్రసిద్ధ్ వేసిన యార్కర్లు కాస్తా ఫుల్ టాస్‌లుగా మారడంతో ఐర్లాండ్ బ్యాటర్లు భారీగా పరుగులు రాబట్టారు. అతను తన 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 16వ ఓవర్ వేసిన సుందర్ ఏకంగా 19 పరుగులు ఇవ్వగా, ఆ తర్వాతి ప్రసిద్ధ్ ఓవర్లో డెలానీ 27 పరుగులు పిండుకున్నాడు. ఈ రెండు ఓవర్లలోనే 46 పరుగులు రావడంతో ఐర్లాండ్ కోలుకుంది. అయితే, డెత్ ఓవర్లలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన హర్షిత్ రాణా హాఫ్ సెంచరీ చేసిన టక్కర్‌ను అవుట్ చేసి తన కెరీర్ బెస్ట్ గణాంకాలను (3/24) నమోదు చేశాడు. అక్షర్ పటేల్ సైతం తన చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను నియంత్రించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. మరోవైపు.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. సంజూ శామ్సన్ త్వరగానే అవుట్ అయినా, అభిషేక్ మాత్రం ఐర్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక పూర్తిస్థాయి సభ్యదేశం తరఫున 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదుసార్లు హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న ఏకైక బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. అతని ధాటికి భారత్ పవర్‌ప్లేలోనే 3 వికెట్లకు 68 పరుగులు చేసింది. అయితే, మరో ఎండ్‌లో వికెట్లు పడటం భారత్‌కు శాపంగా మారింది. ఇషాన్ కిషన్ కేవలం ఒక పరుగుకే డెబ్యూ బౌలర్ మాట్ హాలార్డ్‌కు వికెట్ సమర్పించుకోగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా క్రీజులో ఇబ్బంది పడుతూ 3 పరుగులకే అదే హాలార్డ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కాసేపటికే 20 బంతుల్లో 50 పరుగులు చేసిన అభిషేక్ శర్మను లియామ్ మెక్‌కార్తీ అవుట్ చేయడంతో మ్యాచ్ ఐర్లాండ్ వైపు తిరిగింది.

అభిషేక్ అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. 8వ ఓవర్లో 80 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో రన్ రేట్ అదుపులోనే ఉన్నా.. మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. తిలక్ వర్మ రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి 19 పరుగులకే అవుట్ కాగా, వాషింగ్టన్ సుందర్ (9) కూడా నిరాశపరిచాడు. తన పుట్టినరోజు నాడే మ్యాచ్ ఆడుతున్న శివమ్ దూబే రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి ఆశలు రేపినా.. మరో అరంగేట్ర బౌలర్ జై ముంద్రా బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత్ ఆశలు అడుగంటాయి. అక్షర్ పటేల్ 15 పరుగులు చేసినా రన్ రేట్ ఒత్తిడిని అధిగమించలేకపోయాడు. చివరికి హర్షిత్ రాణా ఒక సిక్స్ కొట్టి కాస్త మెరిసినా.. హంఫ్రీస్ బౌలింగ్‌లో మిగిలిన వికెట్లు పడటంతో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ ఇచ్చిన అద్భుతమైన ఫౌండేషన్‌ను ఉపయోగించుకోవడంలో మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తుండగా, ఐర్లాండ్ మాత్రం సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.