First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?

T20 Captain

T20 Captain

భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26 నుంచి ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌తో భారత క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ యుగం ముగిసి, శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి తెరలేవబోతోంది. ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ భారత టీ-20 జట్టుకు 15వ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

సాధారణంగా చాలామంది అభిమానులు మహేంద్ర సింగ్ ధోనినే భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ అని భావిస్తుంటారు, కానీ అది తప్పు. భారత పురుషుల జట్టు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. 2006 డిసెంబర్ 1న జోహాన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ చారిత్రాత్మక మ్యాచ్‌లో సెహ్వాగ్ సారథ్యంలో భారత్ ఘనవిజయం సాధించింది. ఆయన తన కెరీర్‌లో ఒకే ఒక్క టీ-20 మ్యాచ్‌కు కెప్టెన్సీ చేసి, వంద శాతం విజయాల రికార్డును సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఎంఎస్ ధోని అత్యధికంగా 70 మ్యాచ్‌ల్లో భారత్‌ను నడిపించి 42 విజయాలు అందించారు. ధోని తర్వాత విరాట్ కోహ్లీ (48 మ్యాచ్‌లు, 32 విజయాలు), రోహిత్ శర్మ (62 మ్యాచ్‌లు, 50 విజయాలు) మరియు ఇటీవలి వరకు సూర్యకుమార్ యాదవ్ (50 మ్యాచ్‌లు, 42 విజయాలు) పూర్తిస్థాయి కెప్టెన్లుగా జట్టుకు అద్భుతమైన సేవలు అందించారు. రోహిత్ శర్మ 2024 లో, సూర్యకుమార్ యాదవ్ 2026 లో భారత్‌కు టీ-20 ప్రపంచ కప్‌లను అందించి ఈ ఫార్మాట్‌కు వన్నె తెచ్చారు.

వీరితో పాటు వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లలో సురేశ్ రైనా (3 మ్యాచ్‌లు), అజింక్య రహానే (2 మ్యాచ్‌లు), శిఖర్ ధవన్ (3 మ్యాచ్‌లు), రిషభ్ పంత్ (4 మ్యాచ్‌లు), హార్దిక్ పాండ్యా (16 మ్యాచ్‌లు), కేఎల్ రాహుల్ (1 మ్యాచ్), జస్ప్రీత్ బుమ్రా (2 మ్యాచ్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్‌లు), మరియు శుభ్‌మన్ గిల్ (5 మ్యాచ్‌లు) వంటి ఆటగాళ్లు కూడా వేర్వేరు సందర్భాల్లో తాత్కాలిక కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు వారి సరసన 15వ కెప్టెన్‌గా నిలవబోతున్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఐర్లాండ్ గడ్డపై సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది.