Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలు బయటకు వచ్చాయి. రాహుల్ గాంధీ హాజరైన ఓ కార్యక్రమంలో అవమానం జరిగిందనే భావనతో కాంగ్రెస్ సీనియర్ ఎంపీశశి థరూర్ పార్టీ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ముఖ్యమైన మీటింగ్‌కు థరూర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కొచ్చిలో జరిగినమహాపంచాయత్ కార్యక్రమంలో ఈ వివాదానికి బీజం పడింది. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు శశి థరూర్ కూడా హాజరయ్యారు. అయితే అక్కడ మాట్లాడే క్రమం, కూర్చునే ఏర్పాట్ల విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. తొలుత “థరూర్ తర్వాత మాట్లాడేది కేవలం రాహుల్ గాంధీ మాత్రమే” అని ఆయనకు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత థరూర్ మాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ కాకుండా మరికొందరు నేతలు ప్రసంగించడంపై థరూర్‌కు అసంతృప్తి వ్యక్తం చేశారు.
READ MORE: US: అమానుషం.. 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
ప్రత్యేకంగా తన సీనియారిటీకి తగ్గ గౌరవం ఇవ్వలేదన్న భావన థరూర్‌లో బలంగా ఉందని సమాచారం. మాట్లాడే క్రమంలో జరిగిన మార్పులు, ప్రోటోకాల్ పాటించకపోవడం ఆయనకు బహిరంగ అవమానంలా అనిపించిందని చెబుతున్నారు. దీనికితోడు, ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో శశి థరూర్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళలో, పార్టీలో ఆయనకు ఉన్న స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే ఈ నిర్లక్ష్యం మరింత అసంతృప్తికి కారణమైందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఘటన తర్వాత శశి థరూర్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వంపైనా అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తన సేవలకు, తన పాత్రకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న భావనను తన సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేరళ ఎన్నికలపై చర్చించాల్సిన హైకమాండ్ సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ఉద్రిక్తతలను స్పష్టంగా చూపిస్తోంది. అయితే పార్టీ సమావేశానికి దూరంగా ఉన్నప్పటికీ, శశి థరూర్ పూర్తిగా ప్రజా కార్యక్రమాలకు దూరం కాలేదు. ఆయన ఈ రోజు జరిగేకేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొననున్నారు. రాజకీయ సమావేశం కాకపోయినా, ఈ కార్యక్రమంలో థరూర్ హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. థరూర్ అసంతృప్తి, ఆయన మీటింగ్‌కు రాకపోవడం వంటి విషయాలపై పార్టీ మౌనం పాటిస్తోంది.
