AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!

Rain Alert

Rain Alert

Andhra Pradesh Rain Alert: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం సుస్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల వ్యవధిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పయనించిన ఈ తీవ్ర వాయుగుండం, ప్రస్తుతం పార్వతీపురానికి 60 కిలోమీటర్లు, ఒడిశాలోని భవానీపట్నకు 90 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం రాత్రికి సాధారణ వాయుగుండంగా మారి, రాబోయే 24 గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉధృతంగా పొంగిపొర్లే వాగులు, వంకలు, కాజ్‌వేలను దాటేందుకు ఎవరూ సాహసించరాదు. వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రభావిత జిల్లాల్లో మొత్తంగా 8 SDRF, 5 NDRF బృందాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి 7 గంటల సమయానికి వివిధ ప్రాంతాల్లో నమోదైన ప్రధాన వర్షపాతం వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మన్యం జిల్లా చిలకలపల్లె: 108.2 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం: 103 మి.మీ
మన్యం జిల్లా మక్కువ: 101 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా గాడాల: 99.2 మి.మీ
తాళ్లపూడి: 92 మి.మీ
మన్యం జిల్లా పార్వతీపురం: 87.2 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం: 75.2 మి.మీ
కాకినాడ అర్బన్: 71.5 మి.మీ
జగ్గంపేట: 70.5 మి.మీ
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం: 70.5 మి.మీ
విజయనగరం జిల్లా బొబ్బిలి: 69.9 మి.మీ
రాజమహేంద్రవరం అర్బన్: 68 మి.మీ వర్షపాతం నమోదైంది.