NTV Telugu Site icon

Atiq Ahmed: అతీక్‌ అహ్మద్‌ కేసులో అధికారులకే మైండ్ బ్లాంక్..! ఎలా సాధ్యమైంది..?

Atiq Ahmed

Atiq Ahmed

Atiq Ahmed: మాఫియాడాన్‌ అతీక్‌ అహ్మద్‌ శకం ముగిసింది. దీంతో అతడి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. మరోవైపు అతీక్‌ అక్రమాస్తుల వివరాలను అధికారులు బయటకు లాగుతున్నారు. ఆ వివరాలు చూస్తే అధికారులకే మైండ బ్లాంక్ అవుతోంది. పదుల్లో కాదు వందలు, వేల కోట్లకు పైగా ఆస్తులు అతీక్‌ సంపాదించినట్లు తెలుస్తోంది. అతీక్‌ కన్నుపడితే ఏ ఆస్తి అయినా కబ్జా కావాల్సిందే. ఇవ్వను అనడానికి లేదు. అంటే వాళ్లుండరు. అలా ఎంతోమంది మాయమైపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ప్రభుత్వ భూములు, వ్యాపారుల ఆస్తులు, రైతుల పొలాలు ఏదైనా సరే కోరుకుంటే కబ్జా అయిపోవాల్సిందే. అతీక్‌ తను సంపాదించిన ఆస్తుల్లో చాలాభాగం బినామీల పేరిట ఉంచాడు. ఇప్పుడు వారందరినీ గుర్తించడం సవాల్‌గా మారింది.

రాజకీయనాయకులు, వ్యాపారులు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు కూడా అతీక్‌కు బినామీలుగా చెబుతున్నారు. గతంలో అరెస్టు చేసినప్పుడే ఈడీ 11వందల 68కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. అందులో 4వందల కోట్లకుపైగా విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. మరో 750కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, కబ్జా నుంచి విడిపించడం, కూల్చేయడం వంటివి చేశారు. జైల్లో పెట్టినా కూడా అతీక్‌ ఆగడాలు ఆగలేదు. 2018లో డియోరా జైల్లో ఉన్న సమయంలో మోహిత్‌ జైస్వాల్‌ అనే వ్యాపారిని కిడ్నాప్ చేయించాడు. అతడిని జైలుకు రప్పించుకుని అక్కడే కొట్టాడు. 40 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను తన పేరిట రాయించుకున్నాడు.

కాగా, అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. అతీక్‌ ఓ కొడుకు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పెద్దకొడుకులు ఇద్దరూ జైల్లో ఉన్నారు. చిన్నకొడుకులిద్దరూ జువైనల్‌హోంలో ఉన్నారు. భార్య పరారీలో ఉంది. దీంతో అతీక్‌కున్న అసలు ఆస్తుల విలువను బయటకు తీయడానికి అధికారులు తిప్పలు పడుతున్నారు. బినామీల నుంచి ఆస్తుల స్వాధీనం కష్టంగా మారుతోంది. అతీక్‌ మరణంతో చాలామంది బినామీలు కోటీశ్వరులైపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు అతీక్‌ అహ్మద్‌ రహస్య లేఖ విషయం ఉత్కంఠగా మారింది. ఏదైనా దుర్ఘటన జరిగితే, లేదా తాను హత్యకు గురైతే.. దాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని.. మరణానికి ముందే అతిక్‌ దాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ లేఖలో ఏం రాశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.