Site icon NTV Telugu

టీ20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్

అంతర్జాతీయ క్రికెట్‌ లో ఎంతో అనుభవం సాధించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్‌ జట్టు షాక్‌ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో స్కాట్లాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 53పరుగులకే 6వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ను టెయిలెండర్లు ఆదుకున్నారు. క్రిస్‌ గ్రీవ్స్‌ 45, మున్సే 29, మార్క్‌ వాట్‌ 22పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మహేది హసన్‌ మూడు, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షకిబ్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ధాటిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై లక్ష్యానికి 7పరుగుల దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 134పరుగులే చేయగలిగింది. దీంతో స్కాట్లాండ్‌ 6 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు జరిగిన మరో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై ఒమన్‌ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ జట్టు వికెట్‌ కోల్పోకుండా 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆకిబ్‌, జితిందర్‌ సింగ్‌లు పుపువా న్యూగినియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకిబ్‌ 43బంతుల్లో 50 పరుగులు చేయగా.. జితిందర్ సింగ్‌ 42 బంతుల్లోనే 73 రన్స్‌ చేశాడు.

Exit mobile version