స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగని ఖాతాలతో పాటు, కనీసం ఏడాదికి పైగా నిరంతరం సున్నా బ్యాలెన్స్ కలిగి ఉన్న ఖాతాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని బ్యాంకు గుర్తించింది. ఈ తరహా అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతీ ఖాతాదారుడు తమ కేవైసీ వివరాలను వెంటనే పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేసింది.
బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయని ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేయడానికి వినియోగదారులకు 30 రోజుల వ్యవధి ఇవ్వబడింది. ఈ గడువులోగా కేవైసీ అప్డేట్ పూర్తి చేయని పక్షంలో, సదరు ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేయడం లేదా పూర్తిగా మూసివేసే అవకాశం ఉందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం ఈ ప్రక్రియను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో చాలా సులభతరం చేశారు. వినియోగదారులు తమ సమీపంలోని ఎస్బీఐ శాఖను సందర్శించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చిరునామా ఆధార పత్రాలను సమర్పించి నేరుగా కేవైసీ పూర్తి చేయవచ్చు.
ఇంటి వద్ద నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకునే వారు ఎస్బీఐ యోనో యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ద్వారా కేవైసీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల ద్వారా కూడా ఆధార్ ప్రామాణీకరణ ఆధారంగా సులభంగా అప్డేట్ చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది. ఎటువంటి వివరాల మార్పు లేని పక్షంలో నమోదిత ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా సంబంధిత పత్రాలను పంపి ధృవీకరించుకోవచ్చు. అకౌంట్ హోల్డర్లు తమ ఖాతాలు బ్లాక్ కాకుండా ఉండటానికి, అలాగే ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండటానికి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సూచిస్తోంది.

