Crude Oil: హర్మూజ్ సంక్షోభం.. చమురు ధరలు భారీగా పెంపు..

Crude Oil

Crude Oil

హర్మూజ్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలకు ముడి చమురు సరఫరా చేసే సౌదీ ఆరామ్‌కో, మే నెలకు సంబంధించి తన ‘అరబ్ లైట్ క్రూడ్’ ధరను రికార్డు స్థాయిలో పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు విక్రయించే ముడి చమురు ధరను బెంచ్‌మార్క్ ధర కంటే 19.50 డాలర్లు అదనంగా పెంచింది. మార్కెట్ నిపుణులు ఈ పెంపు 40 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత 19.50 డాలర్ల పెంపు కూడా చమురు రంగ చరిత్రలో ఒక అత్యధిక రికార్డుగా నమోదైంది.

Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

సంక్షోభానికి ప్రధాన కారణాలు..

ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అదనపు సుంకాలు వసూలు చేయడం సరఫరా గొలుసును దెబ్బతీసింది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ కీలక సముద్ర మార్గం మూతబడటం అంతర్జాతీయంగా ముడి చమురు కొరతకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలు త్వరలో ముగిసేలా లేకపోవడంతో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ధరల పెంపు వల్ల భారత్ వంటి ఆసియా దేశాల్లో ఇంధన ధరలు పెరిగి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్లకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం కూడా రవాణా ఖర్చులను మరింత భారంగా మార్చింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా, అక్కడ శాంతి నెలకొంటేనే చమురు ధరలు అదుపులోకి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.