Satvik Suicide Note: హైదరాబాద్ నగర శివారులో గల నార్సింగిలోని ఓ ఇంటర్ కళాశాలలో విద్యార్థి తరగతి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా సాత్విక్ సూసైడ్ నోట్‌లో పలు విస్తుపోయే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో టార్చర్ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్, నరేష్ టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. అమ్మా, నాన్న, అన్నయ్య ఈ పని చేస్తున్నందుకు క్షమించండి అంటూ సూసైడ్ నోట్‌లో చెప్పుకొచ్చాడు.
“నాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. అన్నా.. అమ్మానాన్నలను నువ్వే బాగా చూసుకోవాలి. అన్నా.. నేను లేనిలోటును అమ్మానాన్నలకు రానీయకు. ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేక పోతున్నా. ఈ ముగ్గురూ హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్.” -సూసైడ్ నోట్‌లో సాత్విక్ చివరి మాటలు
Read Also: Threat Call: ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ బంగ్లాలను పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బాధిత కుటుంబసభ్యులతో కళాశాల ముందు బైఠాయించిన పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల వద్ద బైఠాయించిన సాత్విక్ కుటుంబసభ్యులకు, బంధువులకు పోలీసులు నచ్చజెప్పారు. కళాశాల యాజమాన్యం పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు శాంతించారు. ఉస్మానియా మార్చురీలో సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరా తీశారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు.