తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగియగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గ్రామాల్లో కొత్త పాలకమండల్లు కొలువుదీరాయి. కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ఆలోచించింది. తనకు కేటాయించిన రింగ్ గుర్తు బ్యాలెట్ పేపర్ ను గెలుపును కాంక్షిస్తూ భక్తి భావంతో దేవుని హుండీలో వేసింది. అనూహ్యంగా ఎన్నికల్లో గెలుపొందింది.
ఆ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైంది. తన గెలుపుతో కోరిక నెరవేరినట్లు తెలిపింది. ఆమె మరెవరో కాదు దమ్మన్నపేట గ్రామానికి చెందిన మూదం గౌతమి జానీ. గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జున స్వామి దేవస్థాన హుండీ లెక్కింపులో ఎన్నికల బ్యాలెట్ పేపర్ ప్రత్యక్షమైంది. ఎన్నికల్లో గెలవాలని దమ్మన్నపేట సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ నమూనా పత్రాన్ని హుండీలో వేసింది. అదే బ్యాలెట్ గుర్తు అభ్యర్థి దమ్మన్నపేట గ్రామంలో విజయం సాధించింది. దేవుడి దీవెనలతోనే గెలుపు సాధ్యమైందని అభ్యర్థి మూదం గౌతమి జానీ సంతోషం వ్యక్తం చేసింది.
