Maiden Test Hundred for Sarfaraz Khan: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే శతకం బాదాడు. టీమ్ సౌథీ వేసిన 57వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన సర్ఫరాజ్.. కెరీర్‌లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తొలి అంతర్జాతీయ సెంచరీ కావడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో పరుగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
ఓ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి..రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన 22వ భారత ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. గత నెలలో చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్ శుభమాన్ గిల్ డకౌట్ అయి సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా సర్ఫరాజ్ రికార్డుల్లోకెక్కాడు. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 2014లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి..రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు.
Also Read: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదటిసారి!
70 పరుగుల వ్యక్తిగత స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్.. ఏ దశలోనూ తడబడలేదు. సర్ఫరాజ్(107), పంత్ (23) క్రీజులో ఉన్నారు. అద్భుత షాట్లతో అలరించాడు. ఆఫ్‌సైడ్లో బౌండరీల ద్వారా ఎక్కువగా రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే శతకం అందుకున్నాడు. పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 63 ఓవర్లలో 294/3. ఇంకా 62 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46.. న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.