Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు..

Saraswati Antya Pushkaralu

Saraswati Antya Pushkaralu

Saraswati Pushkaralu 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో పవిత్ర సరస్వతీ అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమం వద్ద ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానం ఆచరించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు. కంచి కామకోటి పీఠం పీఠాధిపతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. త్రివేణి సంగమ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిజీ, మంత్రులు పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల సందర్భంగా భక్తులతో కాళేశ్వరం కిటకిటలాడుతోంది. ఇక సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకోనున్నారు. గవర్నర్ తొలి రోజు పుష్కర స్నానం ఆచరించి, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సరస్వతీ ఘాట్‌లో జరిగే గోదావరి హారతి, తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక సరస్వతి పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సరస్వతి జ్ఞాన దేవత కాబట్టి, ఈ సమయంలో స్నానం చేయడం వల్ల జ్ఞానం, వివేకం పెరుగుతాయని నమ్ముతారు. విద్యార్థులకు, జ్ఞానాన్ని అన్వేషించేవారికి ఇది చాలా మంచిదని చెబుతారు. సరస్వతి అనుగ్రహంతో బుద్ధి తేటగా మారుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుందట. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళల్లో రాణించాలనుకునేవారికి ఈ స్నానం మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇతర పుష్కరాల మాదిరిగానే, సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. పవిత్రమైన నదిలో స్నానం చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుందట. పుష్కరాల సమయంలో అనేక మంది పండితులు, సాధువులు ఒకచోట చేరతారు. వారిని కలవడం, వారి ఉపదేశాలు వినడం వల్ల మంచి జ్ఞానం లభిస్తుంది. మొత్తంగా, సరస్వతి పుష్కరాలు కేవలం స్నానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది జ్ఞానానికి, విద్యకు, కళలకు సంబంధించిన పవిత్రమైన పండుగ.