Sanju Samson as a Captain: నేడు 32వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ జట్టు అతడిని సారథిగా నియమించింది. ఇందులో భాగంగానే 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నవంబర్ 24 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. జనవరి తర్వాత సంజూ కేరళ తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో కేరళకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగమై అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఆసియా క్రీడల్లోనూ భారత జట్టులో చోటు దక్కించుకున్న సంజూ.. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఆడాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. గత సీజన్‌లోనూ కేరళ జట్టుకు సంజూనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 233 పరుగులు చేశాడు. 137.86 స్ట్రైక్ రేట్‌తో రాణించి, కేరళ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అయితే జట్టు ఎలైట్ గ్రూప్-A లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది.
ఈసారి కేరళ తన తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-C లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, త్రిపుర జట్లు కూడా ఉన్నాయి. కేరళ ప్రకటించిన జట్టులో రెడ్ బాల్ కెప్టెన్ విష్ణు వినోద్, మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జలజ్ సక్సేనా కూడా చోటు దక్కించుకున్నారు.
కేరళ జట్టు:
సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహన్ ఎస్. కున్నుమ్మల్, మహమ్మద్ అజారుద్దీన్ (వికెట్ కీపర్), అహ్మద్ ఇమ్రాన్, గోవింద్ దేవ్ డి. పై, కృష్ణ దేవన్ ఆర్.జె., విష్ణు వినోద్ (వికెట్ కీపర్), సల్మాన్ నిజార్, అఖిల్ స్కారియా, నిఖిల్ ఎం., విఘ్నేష్ పుత్తూర్, జలజ్ సక్సేనా, బిజు నారాయణన్ ఎన్., కార్తీక్ బి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్.ఎం., వైశాఖ్ చంద్రన్, ఆసిఫ్ కె.ఎం., నిధీష్ ఎం.డి.

