హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. నిన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు సైతం హాజరయ్యారు.
Also Read: Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను చూసేందుకు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. నేడు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్‌లు ఆసుపత్రికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించనున్నారు. డాక్టర్లతో భేటీ అయి బాలుడు ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఎంత ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మైత్రి మూవీస్ సంస్థ ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే.