Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..

  • సముద్ర గర్భంలో ఇంధనం కోసం భారత్ భారీ అన్వేషణ..
  • దాదాపు 99 శాతం ఆఫ్‌షోర్ ‘నో-గో’ ప్రాంతాలను అన్వేషణకు తెరిచినట్లు మోదీ వెల్లడి.
  • ‘సముద్ర మథన్’ పథకానికి రూ.84,084 కోట్ల కేటాయింపు.
  • సీస్మిక్ సర్వేలు, డీప్‌వాటర్, అల్ట్రా-డీప్‌వాటర్ డ్రిల్లింగ్‌కు ప్రాధాన్యం.
Samudra Manthan

Samudra Manthan

Samudra Manthan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ.. ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. భారత జలాల్లో సముద్ర అడుగు భాగాల్లో ఇంధన వనరుల కోసం అన్వేషన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వెల్లడించారు. భారత్ తన ఇంధన అవసరాల్లో మెజారిటీ దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే, గతంలో భారత్‌లో ఆఫ్‌షోర్ అన్వేషణకు సంబంధించిన ప్రాంతాల్లో దాదాపు 99 శాతం ప్రాంతాన్ని గతంలో ‘నో-గో’ జోన్‌లుగా ప్రకటించినట్లు, ఇప్పుడు వాటిలో చాలా ప్రాంతాలను అన్వేషణ కోసం తెరిచినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల గ్యాస్, పెట్రోలియం వంటి ఇంధనాన్ని గుర్తించే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

సముద్ర మంథన్ అంటే ఏమిటి..?

భారత్ ఇంధన నిల్వల్ని అన్వేషించేందుకు ‘‘సముద్ర మంథన్’’ అనే నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్ ప్రకటించింది. భారతదేశ సముద్ర తీర ప్రాంతాల్లోని బేసిన్లలో చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించి భవిష్యత్తులో ఉత్పత్తి పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 2026 జూలై 31న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ.84,084 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులో సముద్ర అడుగుభాగంలోని భౌగోళిక నిర్మాణాలను గుర్తించేందుకు సిస్మిక్ సర్వేలు, డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్ డ్రిల్లింగ్, సైంటిఫిక్ డ్రిల్లింగ్, సాధారణ ఆఫ్‌షోర్ మౌలిక వసతులు, చమురు-గ్యాస్ తయారీ వంటివి ఉంటాయి. ఈ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఆయిల్ ఈక్వివలెంట్ హైడ్రోకార్బన్ నిల్వలు దేశానికి సమకూర్చవచ్చని, దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

99 శాతం నో-గో ఏరియాలు ఎలా మారుతున్నాయి..?

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రకారం భారత్‌కు తొమ్మిది ఆఫ్‌షోర్ బేసిన్లు ఉన్నాయి. ఇవి మొత్తం సుమారు 17.3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం నో-గో ఏరియా ప్రాంతాలను 13.67 లక్షల చదరపు కిలోమీటర్ల నుంచి 24,832 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. దీని ద్వారా భారత్‌కు చెందిన 23.6 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్(EEZ)లో సుమారు 99 శాతం ప్రాంతం అన్వేషణకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఏరియాల్లో అన్వేషణ పెరుగుతుంది. అన్వేషణ పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా గ్యాస్, పెట్రోలియం ఉంటుదని హామీ ఇవ్వదు. డీప్-సీ ఎక్స్‌ప్లోరేషన్ చాలా ఖరీదైనది, సాంకేతికంగా క్లిష్టమైనది, ఫలితాలు అనిశ్చితంగా ఉండే ప్రక్రియ. అందుకే మెరుగైన భౌగోళిక డేటా, మరిన్ని డ్రిల్లింగ్ కార్యకలాపాలు, కొత్త మౌలిక వసతుల ద్వారా అన్వేషణ నుంచి ఉత్పత్తి దశకు చేరే అవకాశాలను ‘సముద్ర మథన్’ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారత ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.

ఈ పథకం భారత్‌కు ఎంత ముఖ్యం..?

140 కోట్ల జనాభా కలిగిన భారత్ తన ఇంధన అసవరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. 88.5 శాతం దిగుమతి చేసుకుంటోంది. సహజవాయువు, పెట్రోలియం ఇలా అన్నింటికి గల్ఫ్, రష్యా, అమెరికా వంటి దేశాలే దిక్కు. అంతర్జాతీయ పరిణామాలకు భారత ఇంధన భద్రత ఒడిదొడుకులకు లోనవుతోంది. ఇటీవల హార్ముజ్ జలసంధి, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల భారత్ ‌లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఎక్కువ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. మన సముద్ర భాగాల్లోనే గ్యాస్ లేదా పెట్రోలియం నిల్వలు వెలుగులోకి వస్తే భారతదేశానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.