Site icon NTV Telugu

ISSF World Championships: చరిత్ర సష్టించిన సామ్రాట్ రాణా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కైవసం..!

Samrat Rana

Samrat Rana

ISSF World Championships: భారత షూటర్ సామ్రాట్ రాణా (Samrat Rana) ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతో.. ఈ విభాగంలో వ్యక్తిగతంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా అతడు నిలిచాడు. తన మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడిన సామ్రాట్ రాణా 243.7 పాయింట్ల స్కోర్ సాధించాడు. చైనాకు చెందిన హు కై (Hu Kai) కంటే 0.4 పాయింట్ల తేడాతో గోల్డ్ సాధించాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ 221.7 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుని భారత్‌కు ఈ ఈవెంట్‌లో రెండు పతకాలను అందించారు.

ఇక తన విజయం తర్వాత సమ్రాట్ రాణా మాట్లాడుతూ.. ఈ విజయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది నా మొదటి సీనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, గోల్డ్ గెలవడం అద్భుత అనుభూతి. నేను కేవలం నా టెక్నిక్‌పై దృష్టి పెట్టాను. స్క్రీన్ చూడలేదు, ప్రతిసారి ఒకే విధంగా షూట్ చేయడానికి ప్రయత్నించానని సామ్రాట్ రాణా అన్నారు. ఒలింపిక్ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలుచుకున్న ఐదవ భారతీయ షూటర్ గా సామ్రాట్ రాణా నిలిచాడు. దీనితో అతను అభినవ్ బింద్రా, రుద్రాంక్ష్ పటిల్, తేజస్విని సావంత్, శివ నర్వాల్–ఈషా సింగ్ జంట సరసన చేరాడు.

ఫైనల్ ప్రారంభంలోనే రాణా మంచిగా ఆరంభించి మొదటి రెండు రౌండ్ల తర్వాత 0.3 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. కానీ మధ్యలో 181.2 స్కోర్‌తో మూడో స్థానానికి జారిపోయాడు. ఆ సమయంలో వరుణ్ తోమర్ కంటే కేవలం 0.2 పాయింట్లు వెనుకబడ్డాడు. ఆ తర్వాత తన సామర్ధ్యాన్ని తిరిగి పొందిన రాణా తరువాతి ఆరు షూట్లలో రెండు పర్ఫెక్ట్ 10.9లు కొట్టి తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి షూట్‌లో విజయం కోసం కనీసం 10.3 స్కోర్ అవసరం కాగా.. అతను 10.6 స్కోర్ సాధించి గోల్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పారిస్ 2024 ఒలింపిక్ పతక విజేతలు మనూ భాకర్, స్వప్నిల్ కుసలే తమ ఈవెంట్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో మనూ భాకర్ మధ్యలో లీడ్‌లో ఉన్నప్పటికీ.. 14వ షూట్‌లో 8.8 స్కోర్ కొట్టడంతో ఏడో స్థానానికి జారిపోయింది. ఈషా సింగ్ 16వ షూట్‌లో 8.4 సాధించి ఆరవ స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసలే 575 స్కోర్‌తో ఎలిమినేషన్ రౌండ్‌లోనే బయటకు వెళ్లాడు. అయితే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (592), నీరజ్ కుమార్ (592) క్వాలిఫికేషన్ దశకు అర్హత సాధించారు.

Exit mobile version