NTV Telugu Site icon

Sake Sailajanath: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం!

Sake Sailajanath

Sake Sailajanath

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని, సీఎం తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారని.. అయినప్పటికీ ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని శైలజానాథ్ మండిపడ్డారు.

శనివారం చిత్తూరు జిల్లా రామానాయుడిపల్లిలో కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పనులు చేయవద్దని.. వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లేనని అన్నారు. వైసీపీ నాయకులకు పనులు చేసినట్లు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. సీఎం చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు సంక్షేమం-అభివృద్ధి అందకూడదంటే ఎలా?. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?’ అని ప్రశ్నించారు.