ఏపీలో డీఎస్సీ నిర్వహణ తీవ్ర కుంభకోణంగా మారిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైందని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీలో అంతులేని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, దేశ చరిత్రలోనే ఇంతటి పెద్ద స్కామ్ మరొకటి జరగలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో టీచర్ ఉద్యోగాలను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారని, అడ్డదారిలో ఉద్యోగాలు ఎలా వచ్చాయో ఆధారాలతో సహా బయటపడుతోందని విమర్శించారు.
ఈ మొత్తం వ్యవహారానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని సజ్జల ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై తాము నిలదీస్తే ప్రభుత్వం బుకాయిస్తూ, ఎదురుదాడికి దిగుతోందని మండిపడ్డారు. మొదట్లో ఏమీ జరగలేదని బుకాయించిన వారు, ఆ తర్వాత ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటాయని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై మాట్లాడటానికి తండ్రీకొడుకులు (చంద్రబాబు, లోకేష్) ముందడుగు వేయకుండా, మహిళా అధికారులను ముందుంచి మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం వారు ముందే సిద్ధం చేసుకున్న సమాధానాలు మాత్రమే చెప్తున్నారని పేర్కొన్నారు.
ఇది సాధారణ రిక్రూట్‌మెంట్ కాదని, “క్యాష్ ఫర్ టీచర్ పోస్ట్” అని సజ్జల అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులను కవరప్ చేసేందుకు రకరకాల మలుపులు తిప్పుతోందని, పొరపాట్లు ఉంటే పరిష్కరిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ స్కామ్ చిన్నది కాదని, తప్పు చేసిన వారు కూడా చిన్నవారు కాదని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అంశంపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని సజ్జల స్పష్టం చేశారు.

