Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..

Sai Krishna (1)

Sai Krishna (1)

Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తొలి రోజు సుమారు నాలుగు గంటల పాటు విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విచారణ నిర్వహించారు.

సిట్ విచారణలో సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలపై నాగరాజును అధికారులు ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్ నుంచి అదుపులోకి తీసుకున్న అనంతరం సాయికృష్ణను వెంటనే కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని సిట్ వివరణ కోరినట్లు సమాచారం. అలాగే సాయికృష్ణ కస్టడీలో చిత్రహింసలకు గురయ్యాడా.? లాకప్‌లోనే మరణించాడా.? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా.? లేదా.? అనే అంశాలపై కూడా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా.? అనే కోణంలోనూ సిట్ ఆరా తీసింది.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణలపై కూడా సీఐ నాగరాజును ప్రశ్నించినట్లు సమాచారం. లాకప్ డెత్ జరిగిన రోజు స్టేషన్‌లో ఏ సిబ్బంది విధుల్లో ఉన్నారు, వారి పాత్ర ఏమిటి.? కేసు అనంతరం స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు అదృశ్యమైంది.? ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారనే.. అంశాలపై సిట్ ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు సమాచారం.

విచారణ సందర్భంగా సీఐ నాగరాజు పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలుస్తోంది. దీంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను శుక్రవారం ఉదయం 10 గంటలకు మరోసారి విచారించనున్నారు. మొత్తం 7 రోజుల విచారణలో భాగంగా ఇంకా ఆరు రోజుల పాటు సిట్ ఆయనను ప్రశ్నించనుంది. ఈ కేసులో లాకప్ డెత్, ఆధారాల ధ్వంసం, మృతదేహం మాయం వంటి ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలపై ఆసక్తి నెలకొంది.