ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ‘ఇండియా మాస్టర్స్’ దూసుకెళుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక మాస్టర్స్‌పై ఇండియా మాస్టర్స్ గెలిచిన విషయం తెలిసిందే.
నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. ధవళ్ కులకర్ణి (3/21), పవన్ నేగి (2/16), అభిమన్యు మిథున్ (2/27)ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇయాన్ మోర్గాన్ (14), మస్టర్డ్ (8), అంబ్రోస్ (23), మాడీ (25), బ్రెస్నన్ (16)లు పరుగులు చేశారు.
అనంతరం లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ 11.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. శ్రీలంక మాస్టర్స్‌పై నిరాశపర్చిన సచిన్.. ఈసారి మెరిశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. గుర్‌కీరత్ సింగ్ మాన్ (63 నాటౌట్; 35 బంతుల్లో 10×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. యువరాజ్ సింగ్ (27 నాటౌట్; 14 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పవన్ నేగికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మార్చి 1న సౌతాఫ్రికా మాస్టర్స్‌తో ఇండియా తలపడనుంది.