Site icon NTV Telugu

Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!

Sachin Tendulkar Birthday

Sachin Tendulkar Birthday

Sachin Tendulkar Birthday: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న సమయంలో, సచిన్ మాత్రం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో సాధారణంగా, హృదయాన్ని తాకే విధంగా తన బర్త్‌డేను జరుపుకున్నారు. సచిన్ టెండూల్కర్ దంతేవాడ జిల్లాలోని చిందనార్ అనే దూర ప్రాంత గిరిజన గ్రామాన్ని సందర్శించారు. ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా స్థానిక పిల్లలతో కలిసి తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కుమార్తె సారా టెండూల్కర్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

గ్రామంలోని కొత్తగా నిర్మించిన క్రీడా మైదానంలో సచిన్, గిరిజన పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే సచిన్ సర్” అంటూ పిల్లలు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం ఆనందోత్సాహాలతో మార్మోగింది. పిల్లలతో కలిసి సమయం గడిపిన సచిన్, వారితో వాలీబాల్ ఆడుతూ వారిని ఉత్సహపరిచారు. క్రికెట్ గాడ్ ను ప్రత్యక్షంగా చూసిన అక్కడి పిల్లల ఆనందం వెలకట్టలేనంతగా మారింది.

పిల్లలతో గడిపిన అనంతరం సచిన్ అక్కడి క్రీడా మైదానాన్ని పరిశీలించి దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారికి సన్మానం చేశారు. ప్రస్తుతం దంతేవాడ జిల్లాలో 25 క్రీడా మైదానాలు పూర్తయ్యాయి. మరో 25 నిర్మాణంలో ఉన్నాయి. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిభ ఉన్నా.. మైదానాలు లేవని తెలిసి నా చిన్నతనం గుర్తొచ్చిందని, నేను కూడా మైదానంలోనే నా ప్రయాణం ప్రారంభించాను అని అన్నారు. అంతేకాకుండా తాను కేవలం 50 మాత్రమే కాదు, 100కి పైగా క్రీడా మైదానాల నిర్మాణానికి సహకరిస్తానని ప్రకటించారు.

Exit mobile version