NTV Telugu Site icon

Sunil Gavaskar: ఈ తేడాలు ఎందుకు.. సునీల్‌ గవాస్కర్ ఫైర్!

Sunil Gavaskar

Sunil Gavaskar

Sunil Gavaskar Slams Cape Town Pitch: ఇటీవల దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసిన సంగతి తెలిసిందే. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన టెస్టులో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు (అయిదు సెషన్స్) మాత్రమే పడ్డాయి. పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారి.. బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందులకు గురి చేసింది. టెస్టు చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌ ఇదే. ఈ పిచ్‌ పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ సహా మరికొందరు విమర్శలు చేశారు. తాజాగా భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్ స్పందించి ఫైర్ అయ్యాడు. భారత్‌లోని పిచ్‌లపై ఒకలా, విదేశీ పిచ్‌ల గురించి మరొకలా మాట్లాడటం ఎందుకని ప్రశ్నించాడు.

కేప్‌టౌన్‌ పిచ్‌ క్యురేటర్‌ పొరపాటు చేశాడని అంటున్న వారు.. భారత్‌ పిచ్‌లపై ఎందుకు నోరు పారేసుకుంటారు? అని సునీల్‌ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని పిచ్ పరిస్థితుల్లో పొరపాటు జరిగందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. భారత క్యురేటర్లు పొడి పిచ్‌ తయారు చేస్తే.. గెలుపు కోసమే చేశారంటారు. 2023లో భారత్‌లో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆలౌట్ అవ్వగానే.. ఆసీస్ మాజీ కెప్టెన్‌ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. మా సిబ్బంది కావాలని చేస్తారు.. కానీ మీ సిబ్బంది మాత్రం పొరపాటుగా చేస్తారా?’ అని సన్నీ ఫైర్ అయ్యాడు.

Also Read: Weather Weather Update: 20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా రైళ్ల, విమానాల రాకపోకలు!

త్వరలో భారత గడ్డపై పర్యటించనున్న ఇంగ్లండ్ జట్టును ఉద్దేశించి సునీల్‌ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘మరో మూడు వారాల్లో ఓ టీమ్ భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు వస్తుంది. ఆ దేశానికి చాలా విసుక్కునే, అరిచే మీడియా ఉంది. వారి జట్టుకు ఏది నచ్చకపోయినా, త్వరగా వికెట్స్ పడినా విమర్శలు మొదలవుతాయి. ఆ ఆరోపణలు వేగంగా వ్యాప్తి చెందుతాయి’ అని సునీల్‌ గవాస్కర్ అన్నాడు. భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య త్వరలో టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభమవుతుంది.