Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య అలాస్కలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అయ్యారు. దీంతో రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొంటుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. గత మూడేళ్ల యుద్ధంలో ఇది రెండో అతిపెద్ద వైమానిక దాడిగా ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
READ ALSO: Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్ బాబు?
మాస్కో ముమ్మర దాడులు..
యుద్ధం ముగిసిపోతుందనుకున్న సమయంలో మాస్కో తన దాడులను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌పై బుధవారం రాత్రి 629 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం సోషల్ మీడియాలో తెలిపింది. మూడేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంలో ఇది రెండవ అతిపెద్ద వైమానిక దాడి అని పోస్ట్ చేశారు. మాస్కో 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించిందని, వీటిలో రెండు హైపర్సోనిక్ కింజాల్ క్షిపణులు, తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యా దాడిలో రాజధాని కీవ్‌లో కనీసం 14 మంది మరణించారని, వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ Xలో ఇలా రాశారు.. “ఇప్పటి వరకు రష్యా దాడిలో 14 మంది మరణించారు. వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా పౌరులను చంపడం. రష్యన్లు యుద్ధాన్ని ముగించాలని అనుకోవడం లేదు, కొత్త దాడులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. కీవ్‌లో రాత్రి సమయంలో డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతీస్తున్నారు, నివాస గృహాలు, కార్యాలయ కేంద్రాలు, పౌర సంస్థలు, ప్రతిదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో EU ప్రతినిధి బృందం ఉన్న భవనం కూడా ఉంది. ప్రపంచం ఇప్పుడు బలంగా స్పందించడం చాలా ముఖ్యం. రష్యా తాను ప్రారంభించి, కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలి. కాల్పుల విరమణలను తిరస్కరించడానికి, చర్చల నుంచి వైదొలగడానికి మాస్కో చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు సరికొత్త కఠినమైన ఆంక్షలు అవసరం. రష్యన్లు బలం, ఒత్తిడిని మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రతి దాడికి మాస్కో పరిణామాలను అనుభవించాలి” అని ఆయన రాశారు.
READ ALSO: TCS Bengaluru Lease Deal: అద్దె రూ.2,130 కోట్లు.. టీఎసీఎస్ నయా రికార్డ్..
