Site icon NTV Telugu

Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు..

Russia Nuclear Drills

Russia Nuclear Drills

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉత్తర రష్యాలోని నోవ్‌గొరోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ రాత్రిపూట డ్రోన్ దాడి చేసిందని అన్నారు. అయితే రష్యా వాయుసేన రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనను ఆయన “రాష్ట్ర ఉగ్రవాదం”గా అభివర్ణిస్తూ, రష్యా దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని చెప్పారు. ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఉక్రెయిన్‌తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్పలేదు. డోల్గియే బొరోడీ అనే ఆ నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా ఖ్రుష్చెవ్, బోరిస్ యెల్త్సిన్, పుతిన్ వంటి సోవియట్, రష్యా నేతలు ఉపయోగించారు.

READ MORE: Astrology: డిసెంబర్‌ 30, మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఇది “మరో అబద్ధాల పరంపర” అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్‌పై కొత్త దాడులు చేయడానికే రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా బెదిరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాలని కోరారు.

Exit mobile version