ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ఉదయం కొంత పుంజుకుంది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి విలువ రూ.95.15 వద్ద ఉండగా, గురువారం మార్కెట్ ప్రారంభంలో 23 పైసల లాభంతో రూ.94.92 వద్ద మొదలైంది. డాలర్ బలం ముందు రూపాయి పట్టు సడలుతున్న తరుణంలో, ఈ చిన్నపాటి పెరుగుదల ఆర్థిక విశ్లేషకులకు కొంత ఊరటనిస్తోంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చే మార్పులు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం, దేశీయ స్టాక్ మార్కెట్ కదలికలు రూపాయి విలువపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంటాయి.
విదేశీ మార్కెట్లలో డాలర్ విలువ తగ్గినప్పుడు, దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగినప్పుడు రూపాయి మరింత బలోపేతం అవుతుంది. రూపాయి విలువ పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దిగుమతి ఖర్చులు తగ్గడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది. అయితే.. రూపాయి బలపడటం వల్ల ఎగుమతి చేసే వ్యాపారులకు, ఐటీ రంగ సంస్థలకు వచ్చే రాబడిపై రూపాయి మార్పిడి రేటు ప్రభావం పడవచ్చు. ఏదేమైనా.. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరంగా ఉండటం అనేది దేశ ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ వాణిజ్య సమతుల్యతకు ఎంతో ముఖ్యం.

