Swapnil Kusale Father Slams Maharashtra Govt: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్.. బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న స్వప్నిల్.. ఒలింపిక్స్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ విజేత స్వప్నిల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అయితే ఈ ప్రైజ్‌మనీపై అతడి తండ్రి సురేశ్ కుశాలె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన కుమారుడు స్వప్నిల్ కుశాలేకు కేవలం రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చారని, హరియాణా ప్రభుత్వం వారి అథ్లెట్లకు ఇచ్చిన దానితో పోలిస్తే చాలా తక్కువ అని సురేశ్ కుశాలె అసహనం వ్యక్తం చేశారు. 5 కోట్లు, పుణెలో ఓ ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సురేశ్ కుశాలె కొల్హాపుర్‌లో మీడియాతో మాట్లాడుతూ… ‘మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం.. కాంస్య పతకం సాధించిన ఒలింపిక్ విజేతకు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. 72 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన రెండో వ్యక్తి స్వప్నిల్. ఇప్పుడు కూడా ఈ తరహా విధానం ఎందుకు?. పారిస్ ఒలింపిక్స్‌లో హరియాణా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ఒకరు మాత్రమే పతకాలు సాధించారు. మహారాష్ట్రతో పోల్చుకుంటే.. హరియాణా చిన్న రాష్ట్రం. కానీ ప్రైజ్‌మనీ మాత్రం భారీగా ఇచ్చింది’ అని అన్నారు.
Also Read: Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. వీడియో వైరల్!
‘స్వప్నిల్ కుశాలేకు రూ.5 కోట్లు ఇవ్వాలి. అలానే పుణెకు చెందిన బలేవాడీలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర్లో ఓ ఫ్లాట్ కేటాయించాలి. స్టేడియం దగ్గర్లో ఫ్లాట్ కేటాయిస్తే ప్రాక్టీస్‌కు వెళ్లడానికి స్వప్నిల్‌కు ఈజీగా ఉంటుంది. 50 మీటర్ల 3 పొజిషన్స్ రైఫిల్ షూటింగ్ ప్రాంతానికి స్వప్నిల్ పేరు పెట్టాలి’ అని సురేశ్ కుశాలె డిమాండ్ చేశారు. 29 ఏళ్ల స్వప్నిల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంకు చెందిన వాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అతడు ఎంతో కష్టపడ్డాడు. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్ విజయం తర్వాత రైల్వేశాఖ అతడికి ప్రమోషన్ కూడా ఇచ్చింది.