Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికి పైగా చనిపోగా 1100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిషన్ వేసింది. అలాగే ట్రాక్ మరమ్మత్తు పనులను శరవేగంగా చేపడుతున్నారు. మంగళవారం ఉదయం వరకు పనులు పూర్తి చేసి యదావిధిగా రైళ్లు నడిచే విధంగా చూస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని.. బాధ్యులను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే మూడు రైళ్లు ఢీ కొనడానికి గల మూలకారణాన్ని గుర్తించామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ దీనిపై విచారణ జరిపారని కేంద్ర మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకు సంబంధించిన సంఘటన జరిగిందని, దీనికి కవాచ్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Odisha Train Accident: హృదయ విదారకం.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి
‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు.