సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా ఎక్కడి దరఖాస్తులను అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. అందుకోసం 5000 మంది డేటా ఎంట్రీ సిబ్బందిని ఎంగేజ్ చేసామని ఆయన వెల్లడించారు. ప్రతి దరఖాస్తులోని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రతి వార్డులో నాలుగు కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించాము వాటిని అదేవిధంగా ఆన్లైన్ చేస్తున్నామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నామన్నారు. నగరంలో 635 డేటా ఎంట్రీ సెంటర్లను ఏర్పాటు చేశామని, నిన్న ఫ్లై ఓవర్ మీద దొరికిన ఫామ్ ల దరఖాస్తు దారులు ఆందోళన చెందవద్దన్నారు.
ఒక సెంటర్ నుంచి మరొక సెంటర్ కు తీసుకెళ్తున్న క్రమంలో కింద పడ్డాయని చెబుతున్నారని, అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఏ దరఖాస్తు కూడా మిస్ కాలేదని, ఇంటి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటన ప్రకారం చేస్తామన్నారు రోనాల్డ్ రోస్. స్వీకరించిన ప్రతీ అప్లికేషన్ ను అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు కమిషనర్. అప్లికేషన్ అప్లోడ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక్క టీం లీడర్ ను సస్పెండ్ చేశాం..మరొకరిని వివరణ అడిగామన్నారు. ఫస్ట్ అభయహస్తంకు సంబంధించిన అప్లికేషన్స్ అప్లోడ్ చేసి తర్వాత ఇతర అప్లికేషన్లను అప్లోడ్ చేస్తామన్నారు.