Site icon NTV Telugu

Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు

Rome Protests

Rome Protests

Italy: ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అయితే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం పాలస్తీనాకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సోమవారం మిలన్, రోమ్, వెనిస్, నేపుల్స్, జెనోవాతో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.

READ ALSO: IND vs BAN: గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం.. జస్ప్రీత్ బుమ్రా అవుట్!

‘లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్’ అనే పేరుతో..
‘లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్’ అనే పేరుతో ట్రేడ్ యూనియన్లు దేశంలో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో వేలాది మంది నిరసనకారులు పాల్గొని గాజాలో జరుగుతున్న హింస, వేలాది మంది మరణాలకు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఈక్రమంలో దేశంలోని మిలన్ సెంట్రల్ స్టేషన్ వద్ద పరిస్థితి మరింత దిగజారింది. నిరసనకారులు పోలీసులపై కుర్చీలు, కర్రలను విసిరారు. దీంతో పోలీసులు జనాన్ని నియంత్రించడానికి భాష్పవాయును ప్రయోగించారు. నిరసనకారుల దాడిలో 60 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు. 10 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను నిరసిస్తూ డాక్ కార్మికులు అనేక ఓడరేవులను దిగ్బంధించారు. వెనిస్‌లో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. జెనోవా, లివోర్నో, ట్రీస్టే ఓడరేవులలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

రోమ్‌లో పెల్లుబిక్కిన నిరసన..
రోమ్‌లో వేలాది మంది నిరసనకారులు రైల్వే స్టేషన్ వెలుపల ప్రదర్శన చేశారు. తరువాత వారు ఒక ప్రధాన రహదారిని దిగ్బంధించారు. నేపుల్స్‌లో జనాలు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పట్టాలపై కూర్చుని రైల్వే సేవలకు అంతరాయం కలిగించారు. బోలోగ్నాలో నిరసనకారులు ఒక రహదారిని దిగ్బంధించగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ నిరసనలతో ప్రధాన మంత్రి మెలోనిపై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నిరసనలపై ప్రధాని మెలోని స్పందిస్తూ.. “దేశంలో జరుగుతున్న హింస గాజా ప్రజల జీవితాలను మార్చదు, కానీ మన పౌరులు మాత్రం బాధపడతారు” అని అన్నారు.

పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు..
ఇటలీ ప్రధాని మెలోని ప్రస్తుతానికి పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు. ఉనికిలో లేని దేశాన్ని గుర్తించడం ప్రతికూల ఫలితాన్నిస్తుందని ఆమె చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై వామపక్ష పార్టీలు, యూనియన్ల సంఘాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల పాలస్తీనాను గుర్తించిన సమయంలో ఇటలీలో ఈ నిరసనలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా అనేక దేశాలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. అయితే, మిలన్‌లో మెట్రో లైన్లు మూసివేయబడ్డాయి. టురిన్, బోలోగ్నాలోని విద్యార్థులు విశ్వవిద్యాలయ లెక్చర్ హాళ్లను దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, సేవలు అంతరాయం కలిగింది.

READ ALSO: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు

Exit mobile version