NTV Telugu Site icon

Rohit Sharma Birthday: రోహిత్ శర్మ పూర్తి పేరు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలుసా?

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma Full Name and Family Details: రోహిత్ శర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. మేటి బౌలర్లకు సింహ స్వప్నంలా మారిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న సారథి కూడా. రోహిత్ ఆటకు భారత్‌లో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. సిక్సులతో విరుచుకుపడే అతడిని ఫాన్స్ ముద్దుగా ‘హిట్‌మ్యాన్‌’ అని పిలుచుకుంటారు. స్టార్‌ క్రికెటర్ రోహిత్ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. హిట్‌మ్యాన్‌ బర్త్‌ డే సందర్భంగా అతడి పూర్తి పేరు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలుసుకుందాం.

1987 ఏప్రిల్ 30న నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో రోహిత్ శర్మ జన్మించాడు. గురునాథ్‌ శర్మ, పూర్ణిమా శర్మల మొదటి సంతానం రోహిత్‌. ఈ దంపతులకు హిట్‌మ్యాన్‌ అనంతరం విశాల్‌ శర్మ జన్మించాడు. రోహిత్ అసలు పేరు ‘రోహిత్ గురునాథ్ శర్మ’. రోహిత్‌ తల్లి పూర్ణిమ విశాఖపట్నానికి చెందిన వారు. అందుకే రోహిత్ తెలుగులో బాగా మాట్లాడుతాడు. రోహిత్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు అతడి కుటుంబం డోంబివలీకు షిప్ట్‌ అయింది. రోహిత్‌ తండ్రి గురునాథ్‌ ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో స్టోర్‌హౌజ్‌ కేర్‌టేకర్‌గా పనిచేసే వారు. తండ్రికి తక్కువ ఆదాయం ఉండడంతో బోరివలిలో ఉన్న తాతలు, మేనమామల వద్ద రోహిత్ పెరిగాడు. వారాంతాల్లో మాత్రమే తల్లిదండ్రుల వచ్చి.. తమ్ముడితో ఆదుకునేవాడు.

Also Read: LSG vs MI: లక్నోకు గుడ్‌న్యూస్‌.. ముంబైకి దబిడిదిబిడే!

రోహిత్‌ శర్మకు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. రోహిత్‌లో దాగున్న ప్రతిభను గమనించిన అతడి అంకుల్‌.. 1999లో సొంత డబ్బుతో క్రికెట్‌ క్యాంపులో చేర్పించాడు. ఆఫ్-స్పిన్నర్‌గా రోహిత్‌ కెరీర్ ప్రారంభించాడు. అయితే అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని గమనించిన కోచ్ దినేష్ లాడ్.. ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఇచ్చాడు. దాంతో ఎనిమిదో నంబర్ నుండి ప్రమోట్ అయి ఓపెనర్ అయ్యాడు. ఓపెనర్‌గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. హారిస్ మరియు గైల్స్ షీల్డ్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లలో అద్భుతంగా రాణించాడు. 2005లో దేవధర్ ట్రోఫీ ఆడిన రోహిత్.. 2006లో న్యూజిలాండ్ ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ ఏడాదే ముంబై తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ద్వారా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 నుంచి భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు. తనకు మేనేజర్‌గా వ్యవహరించిన రితికా సజ్దేను 13 డిసెంబర్ 2015న వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో కుమార్తె సమైరా జన్మించింది.