NTV Telugu Site icon

BCCI Secretary: జై షా వారసుడు ఎవరు?.. రేసులో మరో బీజేపీ నేత కుమారుడు!

Bcci

Bcci

Rohan Jaitley as BCCI Secretary: ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే. 16 మంది సభ్యులలో 15 మంది షాకు మద్దతుగా ఉన్నారు. అయితే షా ఎప్పుడు నామినేషన్‌ దాఖలు చేస్తాడన్నది ఇంకా తెలియరాలేదు. నామినేషన్‌ వేయడానికి నేడే (ఆగష్టు 27) ఆఖరు తేదీ. మరికొన్ని గంటల్లో విషయం తెలిసిపోనుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం నవంబర్‌ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన బార్‌ క్లే.. మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా అతడు సముఖంగా లేడు.

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక లాంఛనమే అయిన నేపథ్యంలో అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బీసీసీఐ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, బీసీసీఐ కోశాధికారి ఆశిష్‌ షెలార్, ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్, ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ, క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా సహా మరికొంతమంది పోటీలో ఉన్నారు. అయితే రోహన్‌ జైట్లీ రేసులో ముందున్నట్లు సమాచారం.

Also Read: KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్‌.. లక్నోతోనే కేఎల్ రాహుల్!

దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తనయుడే ఈ రోహన్ జైట్లీ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ క్రికెట్‌ సంఘం ప్రెసిడెంట్ బాధ్యతల్లో ఉన్నారు. నాలుగేళ్ల కింద డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తండ్రి లాగే రోహన్‌ కూడా న్యాయవాది. రోహన్‌ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని, బీసీసీఐ కొత్త కార్యదర్శిగా రోహన్‌ను చూడబోతున్నామంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.